Jonna Ravva Upma : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. వీటిని ఎంతో కాలంగా మనం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. బరువు తగ్గడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ జొన్నలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని పిండిగా, రవ్వగా చేసి మనం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. జొన్న రవ్వతో మనం ఎంతో రుచిగా ఉండే ఉప్మాను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ జొన్న రవ్వ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. జొన్న రవ్వతో ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న రవ్వ ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
తెల్ల జొన్న రవ్వ – ఒక టీ గ్లాస్, నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన బంగాళాదుంప – 1, చిన్నగా తరిగిన క్యారెట్ – 1, చిన్నగా తరిగిన టమాట – 1, నీళ్లు – మూడున్నర టీ గ్లాసులు, ఉప్పు – తగినంత.
జొన్న రవ్వ ఉప్మా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జొన్న రవ్వను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి రవ్వను ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉప్పు, బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాట ముక్కలు వేసి వేయించాలి. ముక్కలు చక్కగా వేగిన తరువాత నీళ్లు పోసి కలపాలి.
ఈ నీళ్లు బాగా మరిగిన తరువాత నానబెట్టుకున్న జొన్న రవ్వను వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి చిన్న మంటపై రవ్వను ఉడికించాలి. రవ్వ బాగా ఉడికిన తరువాత మూత తీసి దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న రవ్వ ఉప్మా తయారవుతుంది. దీనిని అల్పాహారంగా, స్నాక్స్ గా కూడా తయారు చేసుకుని తినవచ్చు. జొన్న రవ్వతో ఈ విధంగా ఉప్మాను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.