Sesame Seeds : నువ్వులు.. మన వంటింట్లో ఉండే దినుసుల్లో ఇవి కూడా ఒకటి. నువ్వులను వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే హిందూ సాంప్రదాయంలో కూడా నువ్వులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నువ్వులను వంటల్లో ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. నువ్వుల నుండి తీసిన నూనెను కూడా ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తారు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. నువ్వులు మనకు తెలుపు మరియు నలుపు రంగుల్లో లభిస్తూ ఉంటాయి. ఇవి రెండు కూడా ఔషధ గుణాలను, పోషకాలను కలిగి ఉన్నాయి. నువ్వుల్లో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. నువ్వులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
నువ్వులను, బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. వీటిలో ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమస్యలు కూడా తగ్గుతాయి. ఎదిగే పిల్లలకు నువ్వులను తప్పకుండా ఆహారంలో భాగంగా ఇవ్వాలి. నువ్వులను ఆహారంగా ఇవ్వడం వల్ల పిల్లల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది. శరీరం ధృడంగా తయారవుతుంది. అదే విధంగా రోజూ ఉదయం ఒక టీ స్పూన్ నువ్వులను నోట్లో వేసుకుని నమిలి తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా జుట్టు సమస్యలతో బాధపడే వారు నువ్వులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నువ్వుల్లో ఉండే పోషకాలు జుట్టును ఒత్తుగా, నల్లగా, ధృడంగా ఉంచడంలో సహాయపడతాయి.
నువ్వుల నూనెను వంటల్లో వాడడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ నూనెను రోజూ స్నానం చేయడానికి 10 నిమిషాల ముందు శరీరానికి రాసుకుని ఎండలో కూర్చోవాలి. తరువాత వేడి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు త్గగడంతో పాటు మరలా రాకుండా ఉంటాయి. అలాగే శరీరం కూడా బలంగా తయారవుతుంది. నువ్వులు ఈ విధంగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తప్పకుండా ఏదో ఒక రూపంలో ప్రతిరోజూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే నువ్వులను తీసుకునే ముందు వీటిని కొద్దిగా వేయించి తీసుకోవడం వల్ల పైత్యం చేయకుండా ఉంటుందని వారు తెలియజేస్తున్నారు.