Gongura : ఆకు కూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర కూడా ఒకటి. ఈ ఆకు కూర గురించి తెలియని వారుండరు. గోంగూరతో మనం పచ్చడిని, పప్పును, గోంగూర పులిహోరను, గోంగూర మటన్, గోంగూర చికెన్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. గోంగూర పచ్చడిలో పచ్చి ఉల్లిపాయను వేసుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. గోంగూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
గోంగూర ఆకులతోనే కాకుండా గోంగూర కాయల మీద ఉండే పొట్టుతో కూడా పచ్చడిని తయారు చేస్తారు. గోంగూర ఆకులతోపాటు కాయలు, పువ్వులు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. గోంగూరను పంటగా వేసి వాటి నుంచి నారను తీసి సంచులను తయారు చేస్తుంటారు. మనకు తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర వంటి రెండు రకాల గోంగూరలు లభిస్తాయి. తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూర రుచిగా ఉంటుంది. గోంగూరతో నిల్వ పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటారు. గోంగూర ఆకులకు ఆముదాన్ని రాసి వేడి చేసి గడ్డలపై కట్టుగా కట్టడం వల్ల అవి త్వరగా తగ్గిపోతాయి.
గోంగూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల నేత్ర సంబంధమైన సమస్యలు రాకుండా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. రేచీకటి సమస్య తగ్గుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడే వారు గోంగూరను తినడం వల్ల వీటి నుండి ఉపశమపం లభిస్తుంది. గోంగూరలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ లతోపాటు పీచు పదార్థాలు కూడా అధికంగా ఉంటాయి.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణ శక్తిని పెంచడంలో గోంగూర ఎంతో సహాయపడుతుంది. రక్త హీనత సమస్యతో బాధపడే వారు గోంగూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఎముకలను దృఢంగా ఉంచడంలో, విరిగిన ఎముకలు త్వరగా అతుకునేలా చేయడంలో గోంగూర ఉపయోగపడుతుంది. అతిగా వేడి చేసే శరీర తత్వం ఉన్న వారు గోంగూరను తినక పోవడమే మంచిది. వారానికి రెండు సార్లు గోంగూరను తినడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటామని, కీళ్ల నొప్పులు దరి చేరవని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.