Gongura : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర ఒకటి. గోంగూర పేరు చెబితే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. తెలుగువారు అమితంగా ఇష్టపడే ఆహార పదార్థాల్లో గోంగూర ఒకటి. ఈ గోంగూరతో పప్పు, పచ్చడి వంటి వాటిని తయారు చేస్తుంటారు. గోంగూర పచ్చడిని ఆంధ్ర మాత అని కూడా అంటారు. తెలంగాణ ప్రాంతం వారు దీనిని పుంటి కూర అని అంటారు. గోంగూర పచ్చడి మిక్కిలి రుచికరమైన ఆహార పదార్థం. గోంగూరతో నిల్వ పచ్చడిని కూడా తయారు చేస్తారు. సంవత్సరం పొడవునా నిల్వ ఉండి ఉప్పులో ఊరవేసిన గోంగూర అత్యవసర పరిస్థితుల్లో సిద్ధంగా ఉండే కూర. మెట్ట ప్రాంతంలోనే కాకుండా మాగాని భూముల్లో కూడా గోంగూర వేస్తారు.
గోంగూరలో కూడా కొండ గోంగూర, మంచి గోంగూర అనే రెండు రకాలు ఉంటాయి. కొండ గోంగూర కాడ కొద్దిగా ఎరుపు రంగులో ఉంటుంది. అలాగే ఆకు కూడా కొద్దిగా వగరు రుచిని కలిగి ఉంటుంది. దీనిని ఎక్కువగా నిల్వ పచ్చళ్లకు వాడరు. మంచి గోంగూర పుల్లగా ఉంటుంది. పండు మిరపకాయలను, గోంగూరతో కలిపి కొద్దిగా ఉప్పు వేసి తొక్కి నిల్వ పచ్చడి తయారు చేస్తారు. మన గోంగూర విదేశాలకు పచ్చడి రూపంలో ఎగుమతి అవుతుంది. మానవాళికి గోంగూర ఎంతగానో మేలు చేస్తుంది. బోధకాలు తగ్గడానికి, శరీరంలో వాపులు తగ్గడానికి, రేచీకటిని తగ్గించడానికి, శరీరంలో వ్రణాలు, వాపులు తగ్గడానికి దివ్యౌషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గోంగూరను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రకృతిలో ప్రతి ఆకు మూలికలా పని చేసేదే. సృష్టిలో ప్రతి మొక్క ఎంతో కొంత ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అలాంటి మొక్కల్లో గోంగూర ఒకటి. గోగు పూలు అందంగా ఉంటాయి. అస్తమించే సూర్యుడు గోగు పూల ఛాయలో ఉంటాడని కవులు వర్ణించారు కూడా. గోంగూరలో ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధకులు ఎప్పుడో తెలుసుకున్నారు. వ్రణాలు, గడ్డలపైన గోంగూర ఆకులను ఆముదంతో కలిపి దంచి వేడి చేసి పట్టు వేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. వ్రణాలు, గడ్డల వల్ల కలిగే బాధ తగ్గి అవి త్వరగా పగిలిపోతాయి. రేచీకటి అనే నేత్ర రోగంతో బాధపడే వారు భోజనంలో పప్పుగా లేదా పచ్చడిగా గోంగూరను వాడితే కొంత మేర మంచి ఫలితం ఉంటుంది.
తరచూ గోంగూర వాడుతూ గోంగూర పూలను దంచి అర కప్పు రసం తీసి దానికి అర కప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది. బోదకాలు తగ్గడానికి, శరీరంలో వాపులు తగ్గడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి ఆ పదార్థాన్ని పట్టించాలి. అలా చేస్తే అవి పూర్తిగా మానిపోతాయి. విరేచనాలు అధికంగా అవుతూ ఉంటే కొండ గోంగూర నుండి తీసిన జిగురును నీటిలో కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల విరేచనాలు వెంటనే తగ్గిపోతాయి. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరబెట్టిన గోంగూరను అన్నంతో కలిపి తిన్నా విరేచనాలు తగ్గుతాయి. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బందిపడే వారు గోంగూరను ఎలా తీసుకున్నా కూడా మంచి ఫలితం కలుగుతుంది. ఇది దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది.
శరీరంలో నీరు చేరినప్పుడు ఈ ఆకుకూర పత్యం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ఎ, విటమిన్ బి1, బి2, బి9 లతోపాటు విటమిన్ సి కూడా గోంగూరలో అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల దంత సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. ఇందులో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. గోంగూరలో ఉండే ఫోలిక్ యాసిడ్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. ఇవి గుండె, మూత్రపిండాల సంబంధిత సమస్యలు, వివిధ రకాల క్యాన్సర్ లు రాకుండా కాపాడడంలో సహాయపడతాయి. గోంగూర మన ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పని చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కాబట్టి గోంగూరను తప్పనిసరిగా వాడమని నిపుణులు సలహా ఇస్తున్నారు.