Onions : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో ఉల్లిపాయలు కూడా ఒకటి. ఇవి లేనిదే వంట పూర్తి కాదు. ప్రతి కూరలోనూ ఉల్లిపాయలను వాడాల్సిందే. మనకు ఎరుపు, తెలుపు రంగుల్లో ఉల్లిపాయలు లభిస్తున్నాయి. అయితే ఎరుపు రంగు ఉల్లిపాయల వల్ల మనకు అధికంగా లాభాలు కలుగుతాయి. తెలుపు రంగు ఉల్లిపాయల కన్నా ఎరుపు రంగు ఉల్లిపాయల్లోనే పోషకాలు అధికంగా ఉంటాయి. మనకు ఎరుపు రంగు ఉల్లిపాయలే అధికంగా లభిస్తాయి. అయితే ఉల్లిపాయలు మంచివే కానీ.. వీటిని రోజుకు ఎంత మోతాదులో తినాలి ? అధికంగా తింటే ఏమవుతుంది ? దీనికి నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయల్లో అనేక పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వాటిల్లో ఫ్రక్టేన్ అనే పోషక పదార్థం కూడా ఒకటి. ఇది కార్బొహైడ్రేట్స్ జాతికి చెందినది. మన జీర్ణవ్యవస్థలో ఇది మంచి బాక్టీరియాను పెంచుతుంది. అయితే అధిక మొత్తంలో ఉల్లిపాయలను తింటే జీర్ణవ్యవస్థలో ఎక్కువ మొత్తంలో ఫ్రక్టేన్ చేరుతుంది. ఇది జీర్ణం కాదు. శరీరం దీన్ని జీర్ణం చేయదు, శోషించుకోదు. ఈ క్రమంలో అధిక మొత్తంలో ఉల్లిపాయలను తినడం వల్ల జీర్ణాశయంలో ఎక్కువగా ఫ్రక్టేన్స్ పేరుకుపోతాయి. ఇవి జీర్ణం కావు, శోషించుకోబడవు.. అలాగే ఉంటాయి. దీని వల్ల మనకు గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కనుక ఉల్లిపాయలను అధికంగా తినరాదు. మోతాదులో మాత్రమే తినాలి.
ఇక ఉల్లిపాయలను రోజుకు ఎంత పరిమాణంలో తినవచ్చు.. అనే విషయానికి వస్తే.. రోజుకు 50 నుంచి 80 గ్రాముల ఉల్లిపాయలను తినవచ్చు. అంటే ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ లేదా మీడియం సైజ్ ఉల్లిపాయను తినవచ్చన్నమాట. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా ఉల్లిపాయలను తినడం వల్ల చలువ చేస్తుంది. మన శరీరంలో ఉల్లిపాయలు యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. దీని వల్ల వ్యాధులు తగ్గుతాయి. సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే షుగర్, కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గుతాయి.