Mint Leaves : వంటల తయారీలో ఉపయోగించే పుదీనా ఆకుల గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఆకు చక్కని వాసనను కలిగి ఉంటుంది. వంటలను తయారు చేసేటప్పుడు దీనిని వేయడం వల్ల వాసనతోపాటు రుచి కూడా పెరుగుతుంది. కేవలం వంటల తయారీలోనే కాకుండా పుదీనాను ఉపయోగించి మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. చాలా కాలం నుండే పుదీనా ఆకు వాడకంలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుదీనా బహుళ ప్రయోజనకారిణి అని చెప్పవచ్చు. వంటలలో, ఔషధాల తయారీలో, సుగంధ పరిమళాలను తయారు చేసే పరిమశ్రమలలో పుదీనాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
పుదీనాను వెజ్, నాన్ వెజ్ వంటకాలతోపాటు జ్యూస్, లస్సీ ల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. పుదీనాతో పుదీనా పచ్చడి, పుదీనా రైస్ లను కూడా తయారు చేసుకుని తింటున్నాం. మనకు పుదీనా సంవత్సరం పొడువుగా లభిస్తూనే ఉంటుంది. దీనిని చాలా సులువుగా పెంచుకోవచ్చు. ఔషధ గుణాలు కలిగిన పుదీనా ఆకులను వాడడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మానసిక ఒత్తిడిని తగ్గించి, చక్కటి నిద్రను ప్రసాదించే శక్తి పుదీనా ఆకులకు ఉంది. పుదీనా ఆకులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కడుపులో ఉండే మలినాలు తొలిగిపోయి జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. పుదీనా టీ ని రోజూ తాగడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది.
పుదీనా టీ ని తాగడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు తగ్గడంతోపాటు చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. పుదీనా ఆకులలో పోషక విలువలు కూడా పుష్కలంగా ఉంటాయి. రెండు టీ స్పూన్ల పుదీనా ఆకుల రసం, రెండు టీస్పూన్ల నిమ్మ రసానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండడం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలను తగ్గించడంలోనూ పుదీనా ఆకుల రసం ఉపయోగపడుతుంది. పుదీనా ఆకుల రసాన్ని తరుచూ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ల వంటి సమస్యలు తగ్గుతాయి. ఉదయం పూట ఒక గ్లాసు మజ్జిగలో నాలుగు పుదీనా ఆకులను, ఒక రెబ్బ కరివేపాకును, కొద్దిగా కొత్తిమీరను కచ్చా పచ్చాగా చేసి వేసుకుని తాగడం వల్ల రోజంతా చురుకుగా ఉండవచ్చు. అంతే కాకుండా ఈ విధంగా మజ్జిగను చేసుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారని నిపుణులు తెలియజేస్తున్నారు.