Carrot : మనం ఎక్కువగా వంటింట్లో ఉపయోగించే కూరగాయల్లో క్యారెట్ ఒకటి. క్యారెట్ లను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని మనలో చాలా మందికి తెలుసు. 100 గ్రాముల క్యారెట్ లో 48 క్యాలరీల శక్తి ఉంటుంది. క్యారెట్ లలో బీటా కెరోటిన్ అనే రసాయన సమ్మేళనం అధికంగా ఉంటుంది. క్యారెట్ లను ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడు వీటిలో ఉండే బీటా కెరోటిన్ మన శరీరంలోకి ప్రవేశించిన తరువాత విటమిన్ ఎ గా మారుతుంది. ఈ ప్రక్రియ మన శరీరంలోని కాలేయంలలో జరుగుతుంది. ఈ బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పని చేస్తుంది.
మన శరీరంలోని వ్యర్థాలను తొలగించి రోగాల బారిన పడకుండా చేయడంలో బీటా కెరోటిన్ ఎంతగానో సహాయపడుతుంది. క్యారెట్ ను తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని కూడా మనలో చాలా మందికి తెలుసు. క్యారెట్ ను నేరుగా, వంటల్లో, సలాడ్స్‌లో భాగంగా తినవచ్చు. క్యారెట్ ను జ్యూస్ చేసుకొని కూడా చాలా మంది తాగుతూ ఉంటారు. క్యారెట్‌ను బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవడం వల్ల అధికంగా ఫలితం ఉంటుంది. అయితే క్యారెట్‌ను జ్యూస్ లా చేసుకుని తాగితే మంచిదా, ముక్కలుగా చేసుకుని తింటే మంచిదా.. అనే సందేహం చాలా మందికి కలుగుతుంది.
ఎటువంటి ఆహార పదార్థాలైనా నోటితో నమిలి తినడం వల్లే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆహారాన్ని నమిలినప్పుడు మన నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలం మనం తినే అహారం ద్వారా వచ్చే క్రిములను నశింపజేయడంలో, తిన్న ఆహారం జీర్ణమవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెట్‌ను కూడా ముక్కలుగా చేసుకుని తినడం వల్లే అధిక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ క్యారెట్‌ను తినడం కొంచెం శ్రమతో కూడిన పని. వీటిని నమిలి తినడానికి సమయం ఎక్కువగా పడుతుంది. ఉదయం సమయం లేని వారు, చిన్న పిల్లలు, వృద్ధులు వీటిని ఎక్కువగా తినలేరు. అలాంటి వారు క్యారెట్‌ను జ్యూస్ లా చేసుకుని తాగాలి.
ఈ జ్యూస్ లో క్యారెట్ తో పాటు గా బీట్‌రూట్, కీరదోసను కూడా ఉపయోగించవచ్చు. దీంతో ఈ జ్యూస్ మరింత రుచిగా తయారవుతుంది. కానీ ఈ జ్యూస్ ను నెమ్మదిగా తాగాలి. ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ ను కనీసం పది నిమిషాల పాటు కొద్ది కొద్దిగా తాగాలి. ఇలా తాగడం వల్ల క్యారెట్ ను నమలడం ద్వారా ఎంత మోతాదులో లాలాజలం ఉత్పత్తి అవుతుందో జ్యూస్ తాగడం వల్ల కూడా అంతే లాలాజలం ఉత్పత్తి అవుతుంది. కనుక ఇలా చేస్తే క్యారెట్ ను ముక్కలుగా చేసి తిన్నా, జ్యూస్ గా చేసి నెమ్మదిగా తాగినా ఒకేలా ఫలితం ఉంటుంది. క్యారెట్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. వేసవి కాలంలో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అలాగే శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ అందుతాయి.