Off Beat

మనమందరం ఎప్పటి నుంచో వింటున్న దూరదర్శన్‌ చానల్‌ ట్యూన్‌ను ఎవరు రూపొందించారో తెలుసా..?

ఇప్పుడంటే కాదు కానీ.. ఒకప్పుడు.. అంటే.. 80, 90 సంవత్సరాల కాలంలో దూరదర్శన్‌ అంటే.. ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది.. దాని ట్యూన్‌.. మంద్ర స్థాయిలో వచ్చే సంగీతంతో సుడులు తిరుగుతూ డీడీ లోగో ప్రత్యక్షమవుతుంది. అప్పట్లో కేవలం రేడియో మాత్రమే తెలిసిన జనాలకు డీడీ ఓ వరంలా దొరికిందనే చెప్పవచ్చు. అప్పటి వరకు రేడియోల్లో మాటలు మాత్రమే విన్న జనాలు టీవీల్లో ప్రసారాలు చూసి మురిసిపోయారు. ఇక లైవ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు వస్తే.. జనాలు విస్మయానికి లోనయ్యేవారు. అయితే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… అప్పట్లో వచ్చిన ఆ డీడీ ట్యూన్‌ను ఎవరు రూపొందించారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

దూరదర్శన్‌ చానల్‌ మొదట ఢిల్లీలో 1959, సెప్టెంబర్‌ 15వ తేదీన ప్రారంభమైంది. 1965లో అందులో రోజువారీ కార్యక్రమాల ప్రసారాలను ప్రారంభించారు. తరువాత 1972లో ముంబై, అమృతసర్‌ నగరాల్లో దూరదర్శన్‌ సేవలను స్టార్ట్‌ చేశారు. ఇక 1976లో పండిట్‌ రవిశంకర్‌, ఉస్తాద్‌ అలీ అహ్మద్‌ హుస్సేన్‌ ఖాన్‌లతో డీడీ ట్యూన్‌ను రూపొందించారు. అనంతరం 80, 90 దశకాల్లో డీడీ లోగోను రీడిజైన్‌ చేశారు.

do you know who created dd tune

కాగా 1975 వర‌కు డీడీ ప్రసారాలు కేవలం 7 సిటీల్లో మాత్రమే వచ్చేవి. కానీ తరువాత మరో 5 రాష్ట్రాల్లో ప్రసారాలు విస్తరించారు. ఇక 1982 లో ఏషియన్‌ గేమ్స్‌లో తొలిసారిగా డీడీలో కలర్‌లో ప్రసారాలు చేశారు. కాగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా డీడీకి 67కి పైగా స్టూడియోలు ఉన్నాయి. ప్రస్తుతం డీడీ నేషనల్‌, డీడీ న్యూస్‌తో కలిపి వివిధ భాషలు, ప్రాంతీయ చానల్స్‌ కలుపుకుని మొత్తం 35 దాకా ఉన్నాయి. 2003లో 24 గంటల న్యూస్‌ చానల్‌ డీడీ న్యూస్‌ ప్రారంభమైంది. 146 దేశాల్లో డీడీ ఇండియా ప్రసారాలు వస్తున్నాయి.

Admin

Recent Posts