నాగమణి.. ఈ పేరును చాలా మంది వినే ఉంటారు. నాగుపాము తలలో ఉండే మణినే నాగమణి అంటారు. దీన్ని కథగా చేసుకుని అనేక సినిమాలు కూడా వచ్చాయి. ఆ మాట కొస్తే పాము ప్రధాన ఇతివృత్తంగా వచ్చిన మూవీలు కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ ఎంతో ఆకట్టుకుంటాయి. హిందూ సాంప్రదాయంలో పామును దేవతగా భావించి పూజలు చేస్తారు. కనుకనే పాము కథాంశంతో ఏ మూవీ వచ్చినా హిట్ అవుతుంటుంది. ఇక చాలా వరకు సీరియల్స్‌ను కూడా ఇదే కథపై తీశారు. అయితే పాముల గురించి మాట్లాడుకుంటే మనకు గుర్తుకు వచ్చేది నాగమణి. మరి నిజంగా ఇది ఉంటుందా..? అంటే..
పాముల తలలో ఎలాంటి మణులు, రాళ్లు ఉండవు. అనేక మంది సైంటిస్టులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేశారు కూడా. మరి బయట పాములను ఆడించే వాళ్లు పాముల తలలో నాగమణిని బయటకు తీస్తారు కదా…? అంటే అవును, వారు ముందుగానే పాముల తలలో మణి లాంటి రాయిని పెడతారట. దాన్ని ప్రజల మధ్యలో బయటకు తీస్తారు. దీంతో పాము తలలో నిజంగానే మణి ఉందని నమ్మి అందరూ దాన్ని కొనేందుకు ఆసక్తిని చూపిస్తారు. ఇక ఈ మణిని ధరిస్తే పాములు ఏమీ చేయవని, ఏమైనా పాములు పగబట్టి ఉంటే మనల్ని వదిలేస్తాయని, అలాగే నాగ దేవత ఆశీస్సులు కూడా మనపై ఉంటాయని నమ్ముతారు.
అయితే నాగమణి అనేది లేనప్పుడు ఇవన్నీ అశాస్త్రీయమైనవని పరిశోధకులు అంటున్నారు. నాగమణి పేరిట రంగు రాళ్లను విక్రయించే వారిని నమ్మవద్దని కోరుతున్నారు. హిందూ పురాణాల్లో నాగమణుల గురించి ఉంటుంది. పాముల తలలో మణులు ఉంటాయని చెబుతారు. కానీ నిజంగా ఎక్కడా అలాంటి మణులు లేవని, పాముల తలలో రాళ్లు పెరగవని అంటున్నారు. కనుక ఈ విషయంపై అందరూ అవగాహన కలిగి ఉండాల్సిందే.