కాలంలో ప్రయాణించడం అనే విషయాన్ని ఇప్పటికి మనం అనేక సార్లు తెలుసుకున్నాం. దీనిపై అనేక మంది పుస్తకాలు రాశారు. పలు సినిమాలు కూడా ఇదే కాన్సెప్ట్‌తో వచ్చాయి. అయితే నిజానికి ఇది సాధ్యమవుతుందా ? భూత, భవిష్యత్ కాలాల్లో ప్రయాణించడం సాధ్యమేనా ? అందుకు వీలుందా ? అంటే.. అవుననే అంటున్నాడు అతను. అతను 5వేల సంవత్సరానికి కాలంలో ప్రయాణించి మళ్లీ తిరిగి ఈ సంవత్సరానికి వచ్చాడట. అంతేకాదు, ఆ సంవత్సరంలో తీసిందంటూ ఓ ఫోటోను కూడా మనకు చూపిస్తున్నాడు. దీంతోపాటు 5వేల సంవత్సరం గురించి, అప్పుడు మనుషులు ఎలా ఉంటారు అనే విషయాల గురించి కూడా అతను చెబుతున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ సిటీకి చెందిన ఓ వ్యక్తి 2004లో అక్కడ నిర్వహించిన ఓ ప్రయోగంలో పాల్గొన్నాడట. దీంతో అతను కాలంలో భవిష్యత్ కు ప్రయాణించి 5వేల సంవత్సరానికి చేరుకున్నాడట. అప్పుడు లాస్ ఏంజెల్స్ సిటీ మొత్తం నీట మునిగి ఉందని, తాను దాన్ని ప్రత్యక్షంగా చూశానని చెబుతున్నాడు. ఇక ఆ సిటీ నీట మునిగి ఉందన్నట్టుగా చూపించే ఓ ఫొటోను కూడా అతను చూపించాడు. తాను 5వేల సంవత్సరంలో లాస్ ఏంజెల్స్ సిటీలో ఉన్నానని, అప్పుడు ఆ నగరం మొత్తం నీట మునిగి ఉందని, కానీ అన్ని నివాసాలు చెక్కతో ఉన్నాయని చెబుతున్నాడు. 5వేల సంవత్సరం నాటికి గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచంలో చాలా వరకు నగరాలు నీటిలో మునిగిపోతాయని కూడా అతను చెబుతున్నాడు.
అలాగే 5వేల సంవత్సరంలో జనాలు అందరూ తాగునీరు లేక ఒక బాటిల్ నీటి కోసం ఒకరినొకరు చంపుకుంటారని, ఆ దృశ్యాలను తాను చూసి వచ్చానని చెప్పాడు. అయితే ఆ వ్యక్తి ఇలా చెప్పడం ఏమో గానీ చాలా వరకు జనాలు దీన్ని నమ్మడం లేదు. అవును మరి, కాలంలో ప్రయాణించడం అనే విషయంపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉండవచ్చు గాక. కానీ ఇది సక్సెస్ అయినట్టు దాఖలాలు లేవు. అప్పటి వరకు మనం ఇలాంటి వార్తలను వినాల్సిందే. కాలంలో ప్రయాణించే పరికరాలను సినిమాల్లో చూడాల్సిందే. తప్ప వేరే మార్గం లేదు. ఏమంటారు.