పాకిస్థాన్‌లో ఉన్న అబోటాబాద్ ప్రాంతమది. చుట్టూ ఎటు చూసినా పచ్చని పర్వతాలే. ఆ పర్వతాల నడుమనే విసిరేసినట్టుగా అక్కడొక ఇల్లు అక్కొడక ఇల్లు ఉన్నాయి. అక్కడ కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అక్కడ నివసించే వారికే సరిగ్గా తెలియదు. అలాంటి ప్రాంతంలో ఒక రోజున జరిగిందా సంఘటన. రాత్రి పూట సాయుధులుగా వచ్చిన కొందరు అమెరికన్ నావీ సీల్స్ ఆ ప్రాంతంలో ఉన్న భవనంలోకి చొరబడ్డారు. కొన్ని నిమిషాల్లోనే పై అంతస్తు దాకా వెళ్లారు. చివరకు తమకు కావల్సిన వ్యక్తిని పట్టుకున్నారు. కాదు, పట్టుకుంటూనే కాల్చి చంపేశారు. ఆ చనిపోయిన వ్యక్తే ఒసామా బిన్ లాడెన్. అల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థకు నాయకుడు.
ఒసామా బిన్ లాడెన్‌కు మొత్తం 4 మంది భార్యలు. వారందరికీ కలిపి 20 నుంచి 26 మంది పిల్లల వరకు ఉంటారని తెలిసింది. అయితే అందరు భార్యల్లోకెల్లా అమల్ బిన్ లాడెన్ అనే మహిళ చిన్న భార్య. ఆమె ఒసామా బిన్ లాడెన్ చావును కళ్లారా చూసింది. అయితే అప్పుడు.. అంటే.. లాడెన్ చనిపోయిన రాత్రి అసలు ఏం జరిగింది..? అనే విషయాలను మాత్రం ఆమె గతంలో వెల్లడించింది. The Exile: The Flight of Osama bin Laden అనే పుస్తకాన్ని రాసిన క్యాథీ స్కాట్ క్లార్క్, అడ్రియన్ లెవీ అనే ఇద్దరికి ఈ విషయాలను ఆమె చెప్పింది. ఆ వివరాల ప్రకారం… అసలు లాడెన్ చంపబడిన రోజున రాత్రి అంటే… మే 2, 2011వ తేదీన అర్థరాత్రి ఏం జరిగిందంటే…
అది మే 1వ తేదీ. 2011వ సంవత్సరం. రాత్రి 11 గంటలవుతోంది. అప్పుడే ఒసామా బిన్ లాడెన్ రాత్రి భోజనం చేసి, ఆ తరువాత ప్రార్థన చేసుకున్నాడు. తన నాలుగవ భార్య అయిన అమల్ బిన్ లాడెన్‌తో కలిసి మేడపై 2వ అంతస్తులో ఉన్న బెడ్‌రూంలో నిద్రించాడు. తేదీ మారింది, మే 2 వచ్చేసింది. అర్థరాత్రి 1 గంట అవుతోంది. అప్పటికి చాలా సేపైంది కరెంటు పోయి. ఇంకా రాలేదు. అప్పుడే ఎందుకో అమల్ బిన్ లాడెన్‌కు మెళకువ వచ్చింది. బయట ఏవో శబ్దాలు అవుతుండడాన్ని ఆమె గమనించింది. మెల్లగా వెళ్లి తలుపు చాటుగా బయటకు తొంగి చూసింది. అప్పుడే కొందరు అమెరికా Navy SEAL సిబ్బంది కాంపౌండ్ పగలగొట్టి లాన్ లోపలికి వస్తున్నారు. వారిని చూసి అమల్ కంగారు పడింది. వెనక్కి వచ్చి లాడెన్‌ను లేపింది.
లాడెన్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. అతని కళ్లలో ఎన్నడూ లేని ఓ భయాన్ని అమల్ చూసింది. వెంటనే అతను అన్నాడు, అందరినీ ఆ భవనంలోంచి వెళ్లిపోమని, అమెరికన్లకు కావల్సింది నేను, మీరు కాదని అతను తన ముగ్గురు భార్యలతో అన్నాడు (మొదటి భార్య అప్పటి రెండు రోజుల క్రితమే ఆ ఇంటి నుంచి వెళ్లిపోయింది). 2, 3వ భార్యలు వెళ్లిపోయారు, కానీ అమల్ లాడెన్ వెంటే ఉంది. నావీ సీల్స్ ఒక్కో అడుగు ఆచి తూచి వేస్తూ 2వ ఫ్లోర్‌కు వస్తున్నారు. ఇంతలో ఖలీద్ (3 భార్య కొడుకు) లాడెన్‌కు ఏకే 47 తెచ్చి ఇచ్చాడు. అమల్ తన పిల్లలను తీసుకుని మేడపైకి వెళ్లే ప్రయత్నం చేసింది. ఇంతలో ఓ బుల్లెట్ ఆమె కాలికి తగిలింది. దీంతో ఆమె అక్కడే పడిపోయింది.
తల్లి పడిపోగానే పిల్లలు చెరో దిక్కు పోయి దాక్కున్నారు. నావీ సీల్స్ లాడెన్ ఉన్న రూమ్‌కు వస్తూనే బుల్లెట్ల వర్షం కురిపించారు. తలుపు దగ్గరగా వచ్చిన నావీ సీల్ ఆఫీసర్ రాబర్ట్ ఓ నీల్ పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో లాడెన్‌పై బుల్లెట్ల వర్షం కురిపించాడు. అక్కడికి కొంత దూరంలోనే నేలపై పడి ఉన్న అమల్ జరుగుతున్నదంతా వింటున్నది. లేచి చూస్తే చంపుతారని అనుకుంది, చనిపోయినట్టు అలాగే పడుకుని ఉంది. ఈ క్రమంలో చనిపోతున్న లాడెన్ అరుపులను ఆమె విన్నది. లాడెన్ చనిపోయాడని నావీ సీల్స్ ఆఫీసర్స్ అనుకుంటూ ఉన్నారు. అయితే అతను లాడెనేనా అనే సందేహం వారిలో ఉంది. ఇంతలో వారికి ఆ భవనంలో ఉన్న లాడెన్ పిల్లలు, ఓ వృద్ధురాలు దొరికారు. వారిని అడిగి లాడెన్ బాడీని కన్‌ఫాం చేసుకున్నారు. వెంటనే ఆ బాడీని హెలికాప్టర్‌లో తీసుకెళ్లారు. అలా ఆ ఉగ్రవాద నాయకుడి అంతిమ ఘడియలు సాగాయి.
అయితే నావీ సీల్స్ లాడెన్ ఇంటిని చుట్టుముట్టాక అతన్ని సంహరించడానికి ఎంతో పట్టలేదు. నిమిషాల వ్యవధిలోనే ఆ ఇంట్లో చొరబడడం, లాడెన్‌ను చంపడం జరిగిపోయాయి. అనంతరం అతని మృతదేహాన్ని సముద్రంలో పారేశారు. ఈ ఘటనను అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్‌లో ఉండి స్వయంగా పర్యవేక్షించారు. లాడెన్ చనిపోగానే అతని మరణ వార్తను ఆయన ప్రపంచానికి తెలియజేశారు. అయితే గతంలో లాడెన్ కొడుకుగా భావిస్తున్న హంజా అనే యువకుడు అమెరికాను హెచ్చరిస్తున్నట్టుగా ఓ వీడియోను విడుదల చేశారు. అది సంచలనంగా మారింది. కానీ తరువాత మళ్లీ ఎలాంటి వార్త రాలేదు.