మన పెద్దలు ఇప్పటికీ పాటించే పలు పద్ధతులను, ఆచార వ్యవహారాలను మనం మూఢ నమ్మకాలని కొట్టి పారేస్తాం. వాటిని తక్కువగా చేసి చూస్తాం. అయితే నిజానికి చెప్పాలంటే వాటి వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. అవి సైంటిఫిక్ రీజన్స్ అయి కూడా ఉంటాయి. అయితే అలా మన పెద్దలు పాటించే పద్ధతుల్లో ఇప్పుడు చెప్పబోయేది కూడా ఒకటుంది. అదేమిటంటే… రాత్రి పూట, లేదంటే చీకటి పడుతున్నప్పుడు చీపురుతో ఇంటిని శుభ్రం చేయరు. ఇంటిని కనీసం కడగరు, తుడవరు. అయితే అందుకు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడంటే కరెంట్ ఉంది కానీ ఒకప్పుడు అలా కాదుగా, ఇండ్లలో నూనె, కిరోసిన్ దీపాలే ఉండేవి. చీకటి పడిందంటే ఆ దీపాలే వెలుగులు ఇచ్చేవి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇంటిని చీపురుతో శుభ్రం చేసినా, తుడిచినా, కడిగినా మనకు కనిపించని విలువైన, చిన్నవైన వస్తువులు ఏవైనా పోయే అవకాశం ఉంటుంది. కనుకనే చీకటి పడ్డాక చీపురుతో ఊడ్చేవారు కాదు. ఇక ఇంకో కారణం ఏమిటంటే… చీకటి పడ్డాక ఊడుస్తున్నప్పుడు ఆ చీపురు ఏవైనా పురుగులు, కీటకాలకు తగిలితే అప్పుడవి వచ్చి కుట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక పాములు, తేళ్లు వంటివి కుడితే అపాయం కలుగుతుంది. కనుక చీపురుతో ఊడవకుండా ఉంటే అవి అలాగే కదలకుండా ఉంటాయి. కాబట్టి చీకటి పడ్డాక చీపురుతో ఊడవడం మానుకునేవారు.
అదేవిధంగా ఈ విషయంలో ఇంకో కారణం కూడా మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా చీకటి పడ్డాక చీపురుతో ఊడిస్తే దానికి లేచే దుమ్ము, ధూళి తినే ఆహార పదార్థాలపై పడుతుంది కదా. చీకట్లో తింటే ఆ ఆహారం సరిగ్గా చూడరు, అది కనిపించదు. అప్పుడు దుమ్ము పడిన ఆహారం తింటే అది ఆరోగ్యానికి చేటు తెస్తుంది. అనారోగ్యాలను తెచ్చి పెడుతుంది. కనుకనే చీకటి పడ్డాక ఇంటిని చీపురుతో ఊడవడం మానేశారు మన పెద్దలు. అయితే ఇప్పటికీ కొంత మంది దీన్ని పాటిస్తూనే ఉన్నారు..!