Off Beat

పేడ పురుగులు పేడను ఉండలుగా తీసుకెళ్ళి ఏమి చేస్తుంది?

ఇలాంటి ప్రశ్నలను నేను ఎంపిక చేసుకోడానికి ఒక కారణం ఉంది. ఆసక్తి, లేదా అవసరం ప్రేరేపించి అడిగి ఉంటారు కదా అని తెలుసుకుని మరీ రాస్తాను. అయితే అడిగినవారే చూసినట్టు అనిపించదు. సరే మీరు చిరు అభిమానియా. ఒక సినిమాలో అయన డైలాగు వీరశంకరరెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అంటాడు చూడండి. అలా ప్రతి జీవి ఈ ప్రకృతిలో గొప్పేనండీ. మీరు అంతా పేడ పురుగు అని ముక్కు చిట్లించుకుని చదవకుండా పారి పోతారేమో, దాని గొప్ప చివర్లో చెప్తా. ప్రకృతిలో ఇలాంటి జీవులు మట్టిలో ఉండి మనిషికి సాయం చేసే జీవులు . ఇవి నశిస్తే మట్టి ఆరోగ్యం నశించి నట్టే. ప్రాకృతిక తత్వం లోపించి రసాయనాల వాడకం ఎక్కువైనప్పుడు మొదటగా చనిపోయేవి ఇలాంటి జీవులే. వానపాములు, ఇలాంటి పురుగులు ఆమట్టిలో లేకపోతె నష్టం మనకే.

పేడ పురుగుల్ని స్క్రేబిడే కుటుంబం లో చేర్చారు. పురాతన ఈజిప్ట్ ప్రజలు ఈ పురుగుని గౌరవంతో, భయంతో కొలిచేవారు. అది పేడ ఉండని ముద్దగా చేసి దొర్లించటాన్ని, వాళ్ళు సూర్యుడు భూమిని దొర్లించుకుంటూ పోవడం లా ఊహించారు. స్క్రేబ్ తలతో ఖేప్రి అనే దేవుడు ని వీరు పూజించేవారు. అందుకనే ఈ కధ గుర్తొచ్చే విధంగా దాని జంతు శాస్త్ర తరగతికి స్క్రేబ్ అనే పేరు. అసలీ పేడతో వాటికి ఏం పని అని కదా ప్రశ్న, అక్కడికే వస్తున్నా. ఈ పురుగులు మూడు రకాలు. ఒకటి దొర్లించే రకం (rollers) ఇవి పేడ ని సేకరించి అక్కడనుంచి దూరంగా తమకి అనుకూలమైన ప్రదేశానికి తీసుకువెళ్లి, ఆ పేడ లో ఉన్న ద్రవరూప వృక్ష సంబంధ‌ పోషకాలని(జంతువు సగం అరిగించుకుని వదిలేసిన) గ్రహిస్తాయి. ఈ ఉండ లోనే గుడ్లను పెట్టి, అందులోంచి వచ్చే లార్వా లకి ఘనరూపం లో ఉన్న ఆహారాన్ని అందిస్తాయి. కాబట్టి ఆహారం+ సంతాన ఉత్పత్తి ఇలా రెండు విధాలుగా ఈ పేడ ని అవి వాడుకుంటాయి.

what peda purugu do with cow dung what peda purugu do with cow dung

ఇక రెండో రకం బొరియలు తవ్వే రకం (tunnelers). ఇవి పేడ ఉన్న చోట భూమిలోకి రంధ్రాలు తవ్వి, ఈ పేడని అందులోకి లాగి, పైన చెప్పిన రెండుపనులకి దీన్ని వాడుకుంటాయి. ఇలా తవ్వడం వల్లా , భూమి గుల్ల బారటం , మొక్కల కు కావలసిన పేడ ఎరువుగా అందటం, పేడ లో జీర్ణం కాకుండా మిగిలిన విత్తనాలు మొలకెత్తి, విత్తన వ్యాప్తి జరగటం వీటి వల్ల ఒనగూరే అదనపు ప్రయోజనాలు. ఈ పురుగులలో మూడోరకం పేడ లోనే నివాసం ఉండేవి(dwellers). ఇవి పేడ కుప్పలోనే ఉండి అక్కడే పిల్లల ని పెంచుతాయి. వీటి వల్ల వాటికి మనుగడ, అలానే విసర్జక పదార్దాల సత్వర పునర్వినియోగం (speedy recycling) జరుగుతుంది. ఈ పురుగులు ఏనుగు, జింక, ఆవులు, గేదెలు వ్యర్ధాల మీద ఆధార పడతాయి. ఇవి కొన్ని సార్లు పేడ లో గుడ్లు పెట్టె హానికర ఈగలు, క్రిములు (పశువుల్లో వ్యాధుల కి కారణం అయ్యే), కీటకాలని నిర్మూలిస్తాయి కూడా.

కాబట్టి ఇవి 1. పేడని అంటే ఎరువుని పునః పంపిణీ (redistribute) చెయడము, 2. పేడలో పెరిగే హానికర జీవులకి అది అందకుండా తరలించడం 3. నేలలో రంధ్రాలు చేసి దాన్ని గాలి, నీరు మరింత సోకేలా చేయడం 4.విత్తన వ్యాప్తి. ఇలా పలురకాలుగా ఉపయోగ పడే పేడ పురుగుని అసహ్యించుకోడం ఇకనైనా మానేస్తారా?

Admin

Recent Posts