దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఎక్కడో ఓ చోట రైల్వే లైన్ కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే భారతీయ రైల్వే ఇప్పుడు దేశంలోని ప్రతి ప్రాంతానికి విస్తారించింది. సుదూర ప్రయాణాలు చేయాలనుకునే వారిలో చాలా మంది రైల్వేలను ఎంచుకుంటారు. తక్కువ ఖర్చు, సౌకర్యవంతమైన ప్రయాణం కారణంగా ఎక్కువ మంది రైల్లో వెళ్లేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతారు. కానీ, ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క రైల్వే లైన్ కూడా లేని రాష్ట్రం ఒకటి ఉంది. ఏంటీ? దేశంలో రైల్వే లైన్ లేని రాష్ట్రం కూడా ఉందా? అని ఆశ్చర్యపోయినా ముమ్మాటికీ ఇది నిజం. ఇంతకీ ఆ రాష్ట్రం ఏదో తెలుసా?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు దాటినా ఓ రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క రైల్వే లైన్ కూడా లేదు. ఇప్పటి ఆ రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి కూడా రైలు కూత వినలేదు. ఆ రాష్ట్రం మరేదో కాదు సిక్కిం. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు రైల్వే లైన్ అనేది లేదు. ఇక్కడి ప్రజలకు రైలు ప్రయాణం గురించి పెద్దగా తెలియదు. సిక్కిం ప్రజలు రైలు ప్రయాణం చేయాలి అనుకుంటే పక్కనే ఉన్న బెంగాల్ కు వెళ్లాల్సి ఉంటుంది. సిక్కిం సరిహద్దులోని సిలిగురి, జల్పాయ్ గురి రైల్వే స్టేషన్లకు వెళ్లి రైలు ఎక్కుతారు.
సిక్కింలో రైల్వే లైన్ లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు రైల్వే లైన్లకు అనుకూలంగా లేవు. ఈ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ఎత్తైన పర్వతాల మీద ఉంటుంది. అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఎక్కువగా పర్వాతలు, లోయలు ఉంటాయి. ఇలాంటి క్లిష్ట ప్రాంతాల్లో రైల్వే లైన్లు వేయడం అనేది సవాల్ తో కూడిన వ్యహారం. చివరకు బెంగాల్, సిక్కిం రాష్ట్రంతో కలిపేందుకు సివోక్-రాంగ్ పో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో వన్యప్రాణులు ఎక్కువగా ఉండే అభయారణ్యాలతో పాటు కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో ప్రాజెక్టు అనుమతులు చాలా ఆలస్యంగా వచ్చాయి. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఐక్రాన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈ నిర్మాణ పనులు చేపడుతోంది.
సివోక్-రాంగ్‌పో రైల్వే లైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ రైలు మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, వన్యప్రాణులకు ప్రమాదం జరగకుండా రైల్వే ట్రాక్ కు ప్రత్యేకమైన సెన్సార్లు అమర్చుతున్నారు. మొత్తంగా త్వరలో సిక్కిం ప్రజలు రైలు కూత వినబోతున్నారు.