Konda Pindi Aaku : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనేక అనారోగ్య సమస్యల్లో మూత్రాశయ సంబంధిత సమస్యలు కూడా ఒకటి. మూత్రా పిండాలల్లో రాళ్లు, మూత్రాశయంలో రాళ్లు, మూత్రం సాఫీగా రాకపోవడం, అతి మూత్రం, మూత్ర పిండాల పనితీరు మందగించడం వంటి వాటిని మూత్రాశయ సంబంధిత సమస్యలుగా చెప్పవచ్చు. మనలో చాలా మంది మూత్ర పిండాలలో రాళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. మూత్ర పిండాలలో తయారయ్యే రాళ్లను తొలగించుకోవడానికి సర్జరీల వరకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. మన శరీరంలో ఉండే వ్యర్థాలను మూత్ర పిండాలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తూ ఉంటాయి. శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా ఉండి తగిన పరిమాణంలో మూత్రం రానప్పుడు ఈ వ్యర్థాలు శరీరంలో ఉండే ఇతర మలినాలు, రసాయనాలు, లవణాలతో కలిసి రాళ్లలాగా ఏర్పడతాయి. ఇవి చిన్నగా ఉంటే ఎటువంటి నొప్పి, ఇబ్బంది ఉండదు. వీటి పరిమాణం ఎక్కువగా ఉంటే తీవ్రమైన నొప్పితోపాటు ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి.
వీటి పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు వైద్యులు సూచించిన మందులతో తొలగిపోతాయి. రాళ్ల పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. తగినన్ని నీళ్లు తాగకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి వాటిని కూడా మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడడానికి కారణాలుగా చెప్పవచ్చు. మందులు, సర్జరీల అవసరం లేకుండా ఆయుర్వేదం ద్వారా మనం ఈ సమస్య నుండి బయట పడవచ్చు. మన ఇంటి పరిసరాలలో, చేలలో, పొలాల గట్ల మీద ఎక్కువగా ఉండే కొండపిండి ఆకును ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయట పడవచ్చు. దీనిని పాషాణ భేది, పిండి కొండ చెట్టు అని కూడా అంటారు.
మూత్ర పిండాలలో రాళ్లతోపాటు ఇతర మూత్రాశయ సంబంధిత సమస్యలన్నింటినీ తొలగించడంలో కొండపిండి మొక్క దివ్యౌషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క ఆకులను ఇతర కూరగాయలతో, ఆకు కూరలతో వంటలు చేసినప్పుడు అందులో వేసుకోవచ్చు. ఈ మొక్క ఆకులతో పప్పును కూడా చేసుకోవచ్చు. మనకు ఆయుర్వేద షాపులలో ఈ మొక్క ఆకుల చూర్ణం లభిస్తుంది. దీనిని కూడా కూరలలో, చారు, సాంబార్ వంటి వాటి తయారీలో ఉపయోగించవచ్చు.
మనకు జూలై, ఆగస్ట్ నెలల్లో ఈ మొక్క ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ మొక్క ఆకలును ఎండబెట్టుకుని కూడా కూరలలో వేసుకోవచ్చు. మూత్ర పిండాలలో రాళ్ల తీవత్రను బట్టి తగిన మోతాదులో కొండ పిండి ఆకుల రసాన్ని తీసుకుని ఒక కప్పు నీటిలో కలుపుకుని తాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్ల సమస్య తగ్గడమే కాకుండా మూత్రాశయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ మొక్క ఆకులను వంటలలో వాడుతూ.. తగిన పరిమాణంలో నీటిని తాగడం వల్ల భవిష్యత్తులో మూత్రాశయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. కొండపిండి మొక్క మూత్రాశయ సంబంధిత సమస్యలనే కాకుండా ఉబ్బసం, రక్త మొలలు, వీర్య దోషాలు వంటి ఇతర సమస్యలను నయం చేయడంలో కూడా ఈ మొక్క ఆకులు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.