Tulsi Leaves : ఆయుర్వేదంలో తులసి ఆకులకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. పురాతన ఆయుర్వేద వైద్యంలో తులసి ఆకులను విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. తులసి ఆకులతో అనేక ఔషధాలను కూడా తయారు చేస్తారు. తులసి మనకు ప్రకృతి ప్రసాదించిన వరం అనే చెప్పవచ్చు. అయితే తులసి ఆకులను రోజూ పరగడుపున ఎన్ని తీసుకోవాలి, వీటిని తీసుకుంటే ఏం జరుగుతుంది, వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మకోట్‌కు చెందిన హిమాలయన్ అయ్యంగార్ యోగా సెంటర్ యోగా టీచర్ శరత్ అరోరా వివరిస్తున్నారు. ఆయన చెప్పిన వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
తులసి ఆకులను రోజూ పరగడుపునే తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. తులసి ఆకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యూజినాల్ అనే సమ్మేళనం ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. వ్యాధుల తీవ్రత నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగాలు రాకుండా చూసుకోవచ్చు. తులసిలో సహజసిద్ధమైన డైయురెటిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను పరగడుపునే తింటే శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీలు, రక్తం శుభ్రపడతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
తులసి ఆకులను పరగడుపునే తింటే జీర్ణాశయ ఎంజైమ్‌లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతోపాటు జీర్ణక్రియ మెరుగు పడుతుంది. తులసిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గిస్తాయి. తులసి ఆకుల్లో అడాప్టొజెనిక్ లక్షణాలు ఉంటాయి. కనుక వీటిని తింటే శరీరంలో కార్టిసాల్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి. కార్టిసాల్ అనేది ఒత్తిడిని కలిగించే హార్మోన్. తులసి ఆకులను తింటే ఈ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు.
ఎంతో పురాతన కాలం నుంచి తులసిని శ్వాసకోశ సమస్యలను తగ్గించేందుకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. తులసి ఆకులను తినడం వల్ల దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు శ్వాస నాళాల్లో కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. దీంతో శ్వాస సరిగ్గా ఆడుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం తులసి ఆకులను తినడం వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. శరీరంలో ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరుగుతుంది. దీంతో రక్తంలో ఉండే గ్లూకోజ్ సరిగ్గా వినియోగించుకోబడుతుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి.
తులసి ఆకులను రోజూ పరగడుపునే తినడం వరకు బాగానే ఉంటుంది. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఎన్ని ఆకులను తినాలనే విషయంపై చాలా మందికి క్లారిటీ ఉండదు. ఇక యోగా టీచర్ శరత్ అరోరా చెబుతున్న ప్రకారం అయితే.. తులసి ఆకులను మరీ ఎక్కువగా కూడా తినకూడదు. రోజూ వీటిని 1 లేదా 2 తో ప్రారంభించాలి. నెమ్మదిగా అడ్జస్ట్ అయ్యే కొద్దీ ఆకుల సంఖ్యను పెంచవచ్చు. తరువాత 2-3 ఆకులను తినవచ్చు. ఆ తరువాత 4-5 ఆకులను తినాలి. ఈ ఆకులను తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం లేదు అనుకుంటే రోజుకు గరిష్టంగా 5 ఆకుల వరకు తినవచ్చు. అంతకన్నా ఎక్కువ మోతాదులో తినకూడదు.
ఇక తులసి ఆకులను తింటే కొందరికి పడకపోవచ్చు. అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పొట్టలో అసౌకర్యం కూడా కలగవచ్చు. అలాంటి వారు ఈ ఆకులను తినకపోవడమే మంచిది. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, డయాబెటిస్ ఉన్నవారు, తక్కువ షుగర్ లెవల్స్ ఉన్నవారు, రక్తాన్ని పలుచగా చేసే మెడిసిన్లను వాడేవారు డాక్టర్ సలహా మేరకు తులసి ఆకులను తినాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలా తులసి ఆకులను తింటే అన్ని విధాలుగా ప్రయోజనం పొందవచ్చు.