Talambrala Mokka : మన చుట్టూ అనేక రకాల మొక్కలు ఉంటాయి. కొన్ని రకాల మొక్కలను మనం పిచ్చి మొక్కలుగా, కలుపు మొక్కలుగా భావించి వాటిని నివారిస్తూ ఉంటాం. కొన్నిసార్లు తెలిసో తెలియకో ఔషధ గుణాలు కలిగిన మొక్కలను కూడా పిచ్చి మొక్కలుగా భావించి వాటిని నివారిస్తూ ఉంటాం. ఇలాంటి మొక్కలల్లో తలంబ్రాల మొక్క కూడా ఒకటి. ఇది మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నయం చేస్తున్నారు. దీనిని అత్తాకోడళ్ల మొక్క, గాజు కుంప మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు. తలంబ్రాల మొక్క పొదలా 3 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్క పువ్వులు గుత్తులు గుత్తులుగా వివిధ రంగుల్లో ఉంటాయి.
ఈ మొక్క కాయలను పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం తినకూడదు. తలంబ్రాల మొక్క ఏయే వ్యాధులకు ఔషధంగా పనికి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు వచ్చే 15 నుండి 20 రకాల వ్యాధులను తగ్గించడంలో ఈ మొక్క ఉపయోగపడుతుంది. తలంబ్రాల మొక్క ఆకులు నూనెను కలిగి ఉంటాయి. ఈ ఆకులు యాంటీ సెప్టిక్ గా కూడా పని చేస్తాయి. ఈ మొక్క నుండి తీసిన నూనెను గాయాలకు, పుండ్లకు, దురదలకు ఔషధంగా ఉపయోగిస్తారు. గజ్జి, తామర వంటి చర్మ సంబంధమైన సమస్యలను నయం చేయడంలో తలంబ్రాల మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఈ మొక్క సహాయపడుతుంది.
తలంబ్రాల మొక్క ఆకులను మెత్తగా నూరి నొప్పి ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మలేరియా వంటి జ్వరాలను, దగ్గును, గవద బిళ్లలను తగ్గించడంలో కూడా ఈ మొక్క సహాయపడుతుంది. గనేరియా, యుకోరియా వంటి లైంగిక సంబంధమైన రోగాలను నయం చేయడంలో కూడా తలంబ్రాల మొక్క దోహదపడుతుంది. అజీర్ణం, ప్రొమటైటిస్, క్షయ, జలుబు, అధిక రక్త పోటు, చర్మంపై ఉండే దద్దుర్లను తగ్గించడంలో కూడా తలంబ్రాల మొక్క ఉపయోగపడుతుంది.
ఈ మొక్క ఆకుల రసంలో వస్త్రాన్ని తడిపి దానిని కట్టుగా కట్టుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు, బెణుకులు తగ్గుతాయి. ఈ మొక్క పువ్వులకు దోమలను తరిమే గుణం కూడా ఉంది. తలంబ్రాల మొక్క ఔషధ గుణాలతోపాటు కొన్ని విష పదార్థాలను కలిగి ఉంటుంది. కనుక దీనిని ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి. ఈ మొక్కను ఉపయోగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని వారు తెలియజేస్తున్నారు.