Vakudu Mokka : బృహతి పత్రం.. ఈ పత్రాన్ని వినాయకుడి పత్ర పూజలో ఉపయోగిస్తారు. బృహతి మొక్క నుండి మనకు ఈ పత్రం లభిస్తుంది. దీనిని వాకుడాకు, ములక, నేల ములక, వాకుడు అని కూడా పిలుస్తారు. ఈ మొక్క గుబురుగా పెరుగుతుంది. దీనిలో నీలం, తెలుపు రంగు పూలు పూసే రెండు రకాల మొక్కలు ఉంటాయి. ఈ మొక్క చేదు, కారం రుచులను కలిగి ఉంటుంది. ఈ మొక్కకు కాసే కాయలతో కూరను వండుకుని తింటారు. ఇలా కూరను వండుకుని తినడం వల్ల ఎటువంటి కఫ రోగాలైనా తొలగిపోతాయి. వాకుడాకు మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వాకుడాకు మొక్క ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.
దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత సమస్యలను నయం చేయడంలో గుండెను బలంగా చేయడంలో, పురుషుల్లో వీర్య కణాల సంఖ్యను పెంచడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. మూత్రం సాఫీగా వచ్చేలా చేయడంలో, హృదయ సంబంధిత సమస్యలను నయం చేయడంలో వాకుడాకు మనకు దోహదపడుతుంది. ఈ మొక్క ఆకులను నీటిలో ఉడికించి తరువాత వాటిని ఉప్పుతో కలిపి నూరాలి. ఈ మిశ్రమాన్ని వస్త్రంలో ఉంచి కీళ్ల నొప్పులు ఉన్న చోట కట్టడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే గడ్డలపై కూడా ఈ మిశ్రమాన్ని ఉంచి కట్టుకట్టడం వల్ల గడ్డలు త్వరగా మానుతాయి. బృహతి పత్రంతో చేసిన కషాయంతో నోటిని శుభ్రపరుచుకోవడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ మొక్క వేరు నుండి తీసిన రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి తీసుకోవడం వల్ల బిగించిన మూత్రం సాఫీగా సాగుతుంది.
వాకుడాకు మొక్కను సమూలంగా సేకరించి శుభ్రంగా కడగాలి. తరువాత దీనిని ముక్కలుగా చేసి ఎండబెట్టాలి. ఎండిన తరువాత వీటిని కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదను వస్త్రంలో వేసి జల్లించగా వచ్చిన మెత్తటి బూడిదను నిల్వ చేసుకోవాలి. ఈ బూడిదను పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దగ్గు, దమ్ము, ఉబ్బసం, ఆయాసం, ఆస్థమా, క్షయ వంటి శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తెల్ల వాకుడు వేర్లు 5 గ్రాములు, మయూర సిఖిని 5 గ్రాముల మోతాదులో తీసుకుని బాగా దంచాలి. తరువాత ఆవు పేడతో కలిపి మెత్తగా నూరి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని స్త్రీలు నెలసరి స్నానం చేసిన నాటి నుండి వారుం రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల సమస్థ గర్భ దోషాలు తొలగిపోయి సంతానం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వాకుడు చెట్టు వేర్లను, ఆముదం చెట్టు వేర్లను, నీరు గుబ్బి వేర్లను, పల్లేరు చెట్టు వేర్లను సమాన భాగాలుగా తీసుకుని విడివిడిగా దంచి అన్ని పొడులను ఆవు పాలల్లో మెత్తగా నూరి కుంకుడుకాయ గింజలంత పరిమాణంలో మాత్రలుగా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. వీటిని పూటకు ఒక మాత్ర చొప్పున అర కప్పు పెరుగుతో కలిపి పిల్లలకు తినిపించడం వల్ల మూత్రనాళాల్లో ఉన్న రాళ్లు కరిగి పడిపోతాయి. వాకుడాకు వేర్ల నుండి తీసిన రసంలో తేనెను కలిపి రెండు పూటలా చర్మం లోపలికి ఇంకేలా రాసుకోవడం వల్ల పేనుకొరుకుడు సమస్య తగ్గుతుంది.
పచ్చి వాకుడు కాయలను తీసుకు వచ్చి ముక్కలుగా చేసి ఇగురు కూరగా వండుకుని అన్నంతో కలిపి తినడం వల్ల ఉబ్బసం, జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. వాకుడాకు సమూల చూర్ణాన్ని అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి అర కప్పు కషాయం అయ్యే వరకు మరిగించాలి. ఈ కషాయాన్ని గోరు వెచ్చగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది. ఈ కషాయం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా వాకుడు చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఈ మొక్కను ఉపయోగించడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.