Water Spinach : మనకు తినేందుకు అనేక రకాల ఆకుకూరలు అందుబాటులో ఉన్నాయి. ఆకుకూరలు సహజంగానే చాలా రుచిగా ఉంటాయి. అందుకని వీటిని అందరూ ఇష్టంగానే తింటుంటారు. తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర, బచ్చలికూర.. ఇలా అనేక రకాల ఆకుకూరలు ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా నీటి పాలకూర గురించి విన్నారా.. అవును, ఇది కూడా ఉంది. చూసేందుకు అచ్చం పాలకూర మాదిరిగానే ఉంటుంది. కానీ దీని ఆకులు కాస్త పొడవుగా వెడల్పు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది ఏం ఆకుకూర అని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది నీటి పాలకూర. మనకు మార్కెట్‌లో కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే కనిపిస్తుంది. ఇక ఆయుర్వేదం ప్రకారం ఈ ఆకుకూర మనకు వరమనే చెప్పవచ్చు. దీంతో ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నీటి పాలకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది రక్తం ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా గర్భిణీలకు, సర్జరీలు చేయించుకున్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే వారు డాక్టర్ సలహా మేరకు ఈ ఆకుకూరను తినాలి. అలాగే ఈ ఆకుకూరను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తనాళాలు కడిగేసినట్లు క్లీన్ అవుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. ఈ ఆకుకూరను తింటే పచ్చకామెర్ల నుంచి త్వరగా కోలుకుంటారు. లివర్ వ్యాధులను తగ్గిస్తుంది.
నీటి పాలకూరను తింటే మలబద్దకం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ ఆకు యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఈ ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును పెంచుతుంది. దీన్ని తింటే రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. కనుక ఈ ఆకుకూర ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా తెచ్చుకోండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.