Plants : మన ఇంటి పెరట్లో కూడా రకరకాల ఔషద మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. కానీ వాటి వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని మనలో చాలా మందికి తెలియదు. ఈ ఔషధ మొక్కలను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా మన అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిని వాడడం కూడా సులభం. అయితే ఈ ఔషధ మొక్కలను ఇంటి చిట్కాలుగా మాత్రమే ఉపయోగించాలి. ఈ ఔషధ మొక్కలను ఉపయోగించినప్పటికి సమస్య తగ్గు ముఖం పట్టకపోతే వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఇలా మన ఇంట్లో పెంచుకోదగిన ఔషధ మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో సులభంగా పెంచుకోదగిన ఔషధ మొక్కల్లో తులసి మొక్క ఒకటి.
హిందువులు తులసి మొక్కకు ఎంతో భక్తి శ్రద్దలతో పూజ చేస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో తులసి మొక్కను విరివిరిగా ఉపయోగిస్తారు. తులసి ఆకులను నేరుగా తినవచ్చు. అలాగే ఈ ఆకులతో కషాయాన్ని తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు. వీటిలో రామ తులసి, వామ తులసి, కర్పూర తులసి, కృష్ణ తులసి వంటి నాలుగు రకాలు ఉంటాయి. కర్పూర తులసిని ఎక్కువగా బాహ్య ప్రయోజనాల కోసం వాడతారు. అలాగే ఈ కర్పూర తులసి నుండి తీసిన నూనెను చెవిలో వేసుకోవడం వల్ల చెవి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలకు రామ తులసి దివ్యౌషధంగా పని చేస్తుంది. తులసిని ఉపయోగించి తలనొప్పి, మూర్ఛ, నిద్రలేమి, కలరా, మలేరియా, అజీర్తి వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.
అలాగే మన ఇంట్లో పెంచుకోదగిన ఔషధ మొక్కల్లో మెంతి ఒకటి. మెంతులు, మెంతి ఆకులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. మెంతిని ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సులభంగా పెంచుకోవచ్చు. శరీరంలో వేడిని తగ్గించి చలువ చేయడంలో మెంతులు ఎంతగానో సహాయపడతాయి. బాలింతలు మెంతిని తీసుకోవడం వల్ల వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, కాలేయ క్యాన్సర్ ను అరికట్టడంలో, కడుపులో మంట, అల్సర్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా మెంతి మనకు ఉపయోగపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బరువు తగ్గేలా చేయడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో మెంతి మనకు ఎంతో దోహదపడుతుంది.
ఈ మెంతిని ఇంట్లో అందరూ తప్పకుండా పెంచుకోవాలి. అలాగే ఇంట్లో ఉండాల్సిన ఔషధ మొక్కల్లో నిమ్మచెట్టు ఒకటి. నిమ్మకాయలతో పాటు నిమ్మ ఆకులు కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. నిమ్మఆకులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ టీని తాగడం వల్ల నరాల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతుంది. జ్వరాన్ని తగ్గించడంలో, అధిక రక్తపోటును నియంత్రించడంలో, వివిధ రకాల శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో నిమ్మ ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. జీర్ణ శక్తిని మెరుగుపరడచంలో, కీళ్ల నొప్పులను తగ్గించడంలో, కడుపు నొప్పిని తగ్గించడంలో ఈ నిమ్మ ఆకులు మనకు ఎంతో దోహదపడతాయి.
అలాగే మన ఇంట్లో ఉండాల్సిన ఔషధ మొక్కల్లో కలబంద ఒకటి. ఎలాంటి వాతవరణంలో అయినా కలబంద సులభంగా పెరుగుతుంది. దీనికి ఎక్కువగా సస్యసంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంట్లో ఈ మొక్కలు ఉండడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి. బాహ్య శరీరంపై వచ్చే సమస్యలను, అంతర్గతంగా వచ్చే సమస్యలను తగ్గించడంలో కూడా కలబంద మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మ సమస్యలను, జుట్టు సమస్యలను తగ్గించడంలో, బరువు తగ్గడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ ఔషధ మొక్కలను పెంచుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఈ మొక్కలను ఉపయోగించి ఇంట్లోనే చాలా సులువుగా వాటిని నయం చేసుకోవచ్చు.