మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలంటే ఆయన నాలుగు పనులు చెయ్యాలి. తెలంగాణలో ఆయన పార్టీ కార్యకలాపాలు మొదలు పెట్టాలి. పొంగులేటి, షర్మిల మొదలగు వారు ఎంత చెప్పినా వినకుండా పార్టీ మూసేసారు. షర్మిల కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళి ఇప్పుడు జగన్ కి వ్యతిరేకంగా పనిచేశారు. దీన్నే బటర్ ఫ్లై ఎఫెక్ట్‌గా చెప్పవచ్చు. ఖమ్మం, నల్గొండలో ఆయనకి ఇప్పటికీ అభిమానులున్నారు. జనసేన గోదావరి జిల్లాల్ని గుప్పెట్లో పెట్టుకున్నట్టు, జగన్ కూడా కొంత తెలంగాణలో హవా చూపించే ప్రయత్నం చెయ్యాలి.
తెలంగాణ లో చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత, ఆంధ్రలో చంద్రబాబు వస్తేనే ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలుంటాయని భావించారు. జగన్ వైపు అందుకే ప్రజలు నిలబడలేదు. రాష్ట్రాలు వేరైనా, వ్యాపారస్తులు, సినిమా వాళ్ళు, కాంట్రాక్టర్లు కలిసి మెలిసి పనులు చేసుకుంటున్నారు. ఒక రాష్ట్రం రాజకీయాలు మరొక రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తాయని జగన్ ఇప్పటికైనా గ్రహించాలి. బలహీనుడి వైపు నిలబడడం ఎవరికీ నచ్చదు. రాజధాని మార్పు ఉండకూడదు. అమరావతే రాజధాని. వైజాగ్ వాళ్ళు మాకొద్దు అన్నా వినకుండా రాజధానిని చేస్తానంటూ చెప్పారు. ఇరు ప్రాంతాల వాళ్ళూ పోటేశారు. చంద్రబాబు వచ్చాక అమరావతిలో అభివృద్ధి మళ్ళీ గాడిలో పడింది. ఇది మార్చాలని చూస్తే మాత్రం ప్రజలు సహించరు. మూడు రాజధానులు, ముప్పై జిల్లాలు అంటూ చెప్పడం ప్రజలకు నచ్చలేదు.
జనాలకి విసుగు తెప్పించకుండా గవర్నెన్స్ చెయ్యాలి. వాలంటీర్లని చీటికి మాటికీ ఇళ్ళకి పంపడం పల్లెటూరి వాళ్లకి సరదాగా ఉండొచ్చేమో గాని, పట్టణాల్లో వారికి చిరాకు తెప్పిస్తుంది. జగనన్న స్టిక్క్కర్లు అంటిస్తాం, పథకాలిస్తామంటూ ఇళ్ల చుట్టూ ప్రభుత్వ సిబ్బందిని తిప్పకూడదు. అవసరముంటే వాళ్లే వచ్చి అడుగుతారు కదా? అనవసరంగా జనాన్ని డిస్టర్బ్ చెయ్యకుండా ఉండాలి. పేదలకు, మిగిలిన వర్గాలకు మధ్య తేడా చూపించడం ప్రజలకు నచ్చలేదు. పేదోడికేమో పండగొచ్చింది.. పెద్దోడికేమో కోపమొచ్చింది.. అంటూ ప్రాపగాండా ఆపకపోతే ప్రజలు ఓటు వెయ్యలేరు. అప్పర్ మిడిల్ క్లాస్ వారి ఓట్లు అవసరం ఉంటాయి. ఎన్ని పథకాలిచ్చినా.. రోడ్లు, డ్రైనేజీలు బాగు చెయ్యని వారికి ప్రజలు ఓటు వెయ్యరు. కనీస ప్రమాణాలు పాటించడం చాలా అవసరం.
మద్యం విషయంలోనూ జగన్ తప్పటుడుగు వేశారు. పేదలు తాగే మద్యం ధర విపరీతంగా పెరిగింది. చంద్రబాబు అధికారంలోకి రావడానికి మద్యం ధరలు కూడా ఒక కారణం. ఎన్నికల ప్రచార సభల్లోనూ ఆయన ఇదే విషయాన్ని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచుతామన్నారు. మద్యం ధరలను తగ్గిస్తామన్నారు. ఇది వారి విజయానికి దోహదపడింది. మద్య నిషేధం అన్నది అసలు వర్కవుట్ అవదు. మద్యం నిషేధం పెట్టకుండా ఉండాల్సింది.