Chicken : చికెన్ అంటే సహజంగానే చాలా మంది మాంసాహార ప్రియులు ఇష్టంగా తింటారు. చికెన్‌తో చేసే ఏ వంటకం అయినా సరే వారికి నచ్చి తీరుతుంది. చికెన్‌ను చాలా మంది రకరకాలుగా వండుకుని తింటుంటారు. అయితే చికెన్‌ను తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. చికెన్‌లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు పోషణను అందిస్తాయి.
చికెన్‌లో కాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీని వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కండరాల నిర్మాణం, మరమ్మత్తులు జరుగుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కనుక మాంసాహార ప్రియులు చికెన్‌ను తప్పకుండా తీసుకోవాలి.
అయితే చికెన్ తినేవారికి ఎల్లప్పుడూ ఒక సందేహం వస్తుంటుంది. అదేమిటంటే.. చికెన్‌ను స్కిన్‌తో తినవచ్చా ? లేదా ? తింటే ఏమవుతుంది ? చికెన్ స్కిన్ హానికరమా ? అని ప్రశ్నలు వస్తుంటాయి. మరి అందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారంటే..
చికెన్ స్కిన్ హానికరం కాదు.. అది పూర్తిగా ఆరోగ్యకరమే. చికెన్ స్కిన్‌లో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండెకు ఎంతగానో మేలు చేస్తాయి. హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. చికెన్ స్కిన్‌లో ఉండే అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు కొలెస్ట్రాల్, బీపీలను తగ్గించడంలో సహాయ పడతాయి. కనుక చికెన్ స్కిన్‌ను నిర్భయంగా తినవచ్చు. అందులో ఎలాంటి సందేహాలకు గురి కావల్సిన పనిలేదు.
అయితే చికెన్ స్కిన్ తినేవారు దాన్ని బాగా కాల్చి తినాలి. స్కిన్‌తో ఉన్న చికెన్‌ను కాల్చిన తరువాత దాన్ని మీకు నచ్చినట్లు ఏదైనా వంటకం రూపంలో వండుకుని తినవచ్చు. చికెన్ స్కిన్‌ను కాల్చడం వల్ల ఏమైనా హానికర సూక్ష్మ జీవులు ఉంటే చనిపోతాయి. దీంతో ఆ స్కిన్‌ను నిర్భయంగా తినవచ్చు. అయితే చికెన్‌ను స్కిన్‌తో తింటే తక్కువ మొత్తంలో తినాలి. ఎందుకంటే అందులో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మనకు తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. మోతాదుకు మించితే శరీరంలో వాపులు వస్తాయి. కనుక పరిమిత మోతాదులో చికెన్‌ను స్కిన్‌తో తినవచ్చు. ఇందులో సందేహాలకు గురి కావల్సిన పనిలేదు.