Semiya : మన దేశంలో అనేక రాష్ట్రాల్లో సేమ్యాను పలు రకాలుగా వండుకుని తింటారు. దీంతో సేమ్యా ఉప్మా చేసుకుంటారు. కొందరు పాయసం చేసుకుంటారు. దీన్ని తమిళంలో సేమియా అని, హిందీలో సేవయ్యన్ అని, బెంగాలీలో షెమాయ్ అని పిలుస్తారు. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే సేమ్యాను దేంతో తయారు చేస్తారు ? దీన్ని తినడం ఆరోగ్యానికి మంచిదేనా ? ఏదైనా హాని కలుగుతుందా ? అనే విషయాలకు వస్తే..
సేమ్యాను సహజంగానే భిన్న రకాల పిండిల మిశ్రమంతో తయారు చేస్తారు. కొన్ని కంపెనీలు సేమ్యాను రీఫైన్ చేసిన గోధుమ పిండితో తయారు చేస్తాయి. అయితే ఇందులో పోషకాలు పెద్దగా ఉండవు. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు కొద్ది మోతాదులో ఉంటాయి. సులభంగా జీర్ణమవుతాయి. అందువల్ల సేమ్యాతో పెద్దగా ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలగవు. కానీ ఇవి శక్తిని అందిస్తాయి.
అయితే సేమ్యా రీఫైన్ చేయబడిన కార్బొహైడ్రేట్స్ జాబితాకు చెందుతాయి. అంటే వీటిలో ఎలాంటి ఫైబర్ ఉండదు. కనుక వీటిని తింటే మన శరీరంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. సాధారణ వ్యక్తులకు ఏమీ కాదు, కానీ షుగర్ ఉన్నవారికి ఇబ్బందులు వస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు సేమ్యాను తినరాదు.
ఇక సేమ్యా శక్తిని అధికంగా అందిస్తుంది. కనుక బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తినకపోవడమే మంచిది. రోజూ శారీరక శ్రమ, వ్యాయామం ఎక్కువగా చేసేవారు శక్తి కోసం సేమ్యాను తినవచ్చు. కానీ బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిస్ ఉన్నవారు సేమ్యాకు దూరంగా ఉండాలి.
సేమ్యాను తినడం వల్ల హాని కలగదు. కానీ దీన్ని తినడం వల్ల శక్తి తప్ప ఇతర ఏ పోషకాలు లభించవు. కనుక ఇది అందరికీ ఉపయోగం కాదు. కేవలం ఆరోగ్యవంతమైన వ్యక్తులకు మాత్రమే శక్తిని పొందేందుకు సేమ్యా ఉపయోగపడుతుంది. కనుక వారే దీన్ని తినాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.