Curd In Winter : చలికాలంలో అందరూ సహజంగానే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా చర్మం, జుట్టు విషయంలో.. రోగ నిరోధక శక్తిని పెంచుకునే విషయంలో జాగ్రత్తలను పాటిస్తుంటారు. ఇక ఈ సీజన్‌లో కొన్ని ఆహార పదార్థాలకు మనం దూరంగా ఉండాలి. చల్లనివి, శరీరానికి చలువ చేసేవి అసలు తినరాదు. అయితే శరీరానికి చలువ చేసే ఆహారాల్లో పెరుగు ఒకటి. మరి పెరుగును ఈ సీజన్‌లో తినవచ్చా.. అని చాలా మందికి సందేహం కలుగుతుంటుంది. అయితే దీనికి నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు ప్రొబయోటిక్ ఆహారాల జాబితాకు చెందుతుంది. కనుక దీన్ని తింటే శరీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. చెడు బాక్టీరియా నాశనం అవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కనుక ఈ సీజన్‌లో మనకు వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే పెరుగు ప్రొ బయోటిక్ ఆహారం కనుక జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, మలబద్దకం, కడుపులో మంట వంటివి తగ్గుతాయి. చలికాలంలో మలబద్దకం సమస్య వస్తుంది కాబట్టి పెరుగు తింటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. శరీరాన్ని బలంగా తయారు చేస్తుంది. అలాగే పెరుగులో విటమిన్లు, పొటాషియం, మెగ్నిషియం, ప్రోటీన్లు అధికంగానే ఉంటాయి. ఇవి చెడు బాక్టీరియాను నాశనం చేయడంతోపాటు శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి. పెరుగులో ఉండే విటమిన్ సి దగ్గు, జలుబును తగ్గిస్తుంది. కాబట్టి పెరుగును తీసుకోవచ్చు. పెరుగును తినడం వల్ల శరీరంలో పీహెచ్ స్థాయిలు సమతుల్యంలో ఉంటాయి. దీంతో కడుపులో మంట రాదు. తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది. చలికాలంలో మన జీర్ణశక్తి తగ్గుతుంది. కనుక పెరుగును తింటే జీర్ణశక్తిని పెంచుకోవచ్చు.
పెరుగును తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. చలికాలంలో మనకు చర్మం పగులుతుంది. చుండ్రు పెరిగి జుట్టు సమస్యలు వస్తాయి. వీటి నుంచి బయట పడేందుకు పెరుగు దోహదపడుతుంది. శిరోజాలను, చర్మాన్ని పెరుగు ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక పెరుగును ఈ సీజన్‌లో తప్పక తినాల్సిందే. అయితే పెరుగు వల్ల శరీరానికి చలువ కలుగుతుంది. అలాగే మ్యూకస్ కూడా పెరుగుతుంది. కనుక దీన్ని మధ్యాహ్నం మాత్రమే తినాలి. ఈ సీజన్‌లో పెరుగును రాత్రి పూట తినరాదు. అలాగే పెరుగును ఎట్టి పరిస్థితిలోనూ ఫ్రిజ్‌లో పెట్టరాదు. ఈ సీజన్‌లో పెరుగును ఫ్రిజ్‌లో పెట్టకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడే తినాలి. ఇలా చలికాలంలోనూ సురక్షితంగా పెరుగును తినవచ్చు. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి. పైగా పోషకాలు కూడా లభిస్తాయి. కనుక ఆరోగ్యకరమైన రీతిలో పెరుగును తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. పెరుగు చలువ చేస్తుంది కదా అని దానికి దూరంగా ఉండాల్సిన పనిలేదు. ఈ జాగ్రత్తలను పాటిస్తే సురక్షితంగానే పెరుగును తినవచ్చు.