Aloo Chana Chaat : సాయంత్రం స‌మ‌యంలో ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్‌.. ఆలూ చ‌నా చాట్‌.. త‌యారీ ఇలా..!

Aloo Chana Chaat : రోజూ సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది ఏదో ఒక స్నాక్స్ తినాల‌ని చూస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది రోడ్డు ప‌క్క‌న అమ్మే నూనె ప‌దార్థాల‌ను తింటారు. బ‌జ్జీలు, పునుగులు లేదంటే.. బేక‌రీ ప‌దార్థాలైన ప‌ఫ్‌లు, పిజ్జాలు.. ఇలా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను, స్వీట్ల‌ను, నూనె ప‌దార్థాల‌ను తింటుంటారు. కానీ ఇవ‌న్నీ ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి. అందువ‌ల్ల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఉండే స్నాక్స్‌ను తినాలి. దీంతో క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. పైగా క్యాల‌రీలు కూడా రావు. దీంతో బ‌రువు పెర‌గ‌రు. అంతేకాకుండా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పోష‌కాలు ల‌భిస్తాయి. అయితే అలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్‌లో ఆలూ చ‌నా చాట్ కూడా ఒక‌టి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ చ‌నా చాట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళా దుంప‌లు – రెండు, ఉడికించిన కాబూలీ శ‌న‌గ‌లు – ఒక క‌ప్పు, త‌రిగిన ఉల్లిపాయ, ట‌మాటా – ఒక్కోటి చొప్పున‌, త‌రిగిన పచ్చి మిర్చి – 2, కొత్తిమీర తురుము – కొద్దిగా, జీల‌క‌ర్ర పొడి, చాట్ మ‌సాలా, నిమ్మ‌ర‌సం – ఒక టీస్పూన్ చొప్పున‌, స‌న్న కార‌ప్పూస – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీస్పూన్‌.

Aloo Chana Chaat recipe in telugu healthy snacks
Aloo Chana Chaat

ఆలూ చ‌నా చాట్‌ను త‌యారు చేసే విధానం..

శ‌న‌గ‌ల‌ను సుమారుగా 8 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఉప్పు వేసి ఉడికించి ప‌క్క‌న పెట్టుకోవాలి. అలాగే ఆలూను కూడా ఉడికించి పొట్టు తీసి ముక్క‌లుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద గిన్నెలో ఉడికించిన బంగాళాదుంప‌ల ముక్క‌లు, శ‌న‌గ‌లు, జీల‌క‌ర్ర పొడి, చాట్ మ‌సాలా, కారం, ఉప్పు, కొద్దిగా నిమ్మ‌ర‌సం, కొత్తిమీర‌ను వేసి బాగా క‌లిపి కాసేపు ప‌క్క‌న పెట్టాలి. అప్పుడే అన్ని ప‌దార్థాలు ఒక‌దానికొక‌టి క‌లిసిపోయి ఫ్లేవ‌ర్స్ అన్నీ ప‌డ‌తాయి. అందులో ప‌చ్చి మిర్చి తురుము, ట‌మాటా, ఉల్లిపాయ ముక్క‌లు వేసి బాగా క‌ల‌పాలి. చివ‌ర‌గా స‌న్న కార‌ప్పూస వేసుకుంటే రుచిక‌ర‌మైన చాట్ సిద్ధ‌మ‌వుతుంది. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. సాయంత్రం స‌మ‌యంలో చిరుతిళ్ల‌ను తినేందుకు బ‌దులుగా ఇలా ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ చేసుకుని తిన‌వ‌చ్చు. దీంతో ఆరోగ్యానికి ఎలాంటి హాని క‌ల‌గ‌దు.

Editor

Recent Posts