Curd : మనలో చాలా మందికి భోజనం చివర్లో పెరుగు లేదా మజ్జిగతో తిననిదే భోజనం చేసినట్టుగా ఉండదు. పాలతో చేసే ఈ పెరుగును తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో పెరుగు మనకు ఎంతగానో ఉపయోగపడుతంది. చుండ్రు సమస్యను తగ్గించి, జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పెరుగు దోహదపడుతుంది. పెరుగులో శరీరానికి మేలు చేసే బాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అయితే మనలోచాలా మందికి పెరుగును తినడంలో అనేక సందేహాలు వస్తుంటాయి.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా చలికాలంలో పెరుగును తినవచ్చా, రాత్రి పూట పెరుగును తినవచ్చా లాంటి సందేహాలు మనలో చాలా మందికి ఉంటాయి. పెరుగును తినడం గురించి ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణంలో మార్పుల కారణంగా చాలా మంది జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ అనారోగ్య సమస్యలు శరీరంలో ఉండే కఫం కారణంగా తలెత్తుతాయి. చలికాలంలో అలాగే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పెరుగును తినడం వల్ల గొంతులో, ఊపిరితిత్తుల్లో కఫం ఎక్కువగా తయారవుతుందని దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా రాత్రి సమయంలో పాలు తాగి.. మధ్యాహ్న సమయంలో పెరుగు లేదా మజ్జిగను తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కఫానికి విరుగుడుగా వెల్లుల్లి చక్కగా పని చేస్తుందని.. పెరుగు లేకుండా ఉండలేని వారు దానిని వెల్లుల్లి, జీలకర్ర వేసి తాళింపు వేసుకుని తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేసినా కూడా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, రాత్రి భోజనంలో పెరుగును తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో పెరుగు మనకు ఎంతగానో సహాయపడుతుంది. కనుక వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా చలికాలంలో పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. అయితే శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారు మాత్రం సాయంత్రం ఐదు గంటల తరువాత మాత్రం పెరుగును తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రాత్రిపూట పెరుగును తీసుకోకూడదని, మధ్యాహ్న సమయంలో ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.