వాల్ నట్స్‌ను తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బాదంపప్పు లాగే వాల్ నట్స్‌లోనూ అనేకమైన పోషకాలు ఉంటాయి. అవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే వాల్ నట్స్‌ను తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు పలువురు సైంటిస్టులు ఓ అధ్యయనం చేపట్టి ఆ వివరాలను తాజాగా వెల్లడించారు.
అమెరికాలోని హార్వార్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన సైంటిస్టులు 1998 నుంచి 2018 వరకు 20 ఏళ్ల పాటు 67వేల మంది మహిళలు, 26వేల మంది పురుషులకు చెందిన అన్ని వివరాలను పలు అధ్యయనాల ద్వారా సేకరించారు. ఆ వివరాలను పూర్తిగా విశ్లేషించారు. ఈ క్రమంలో వారు ఫలితాలను వెల్లడించారు. ఆ ఫలితాల ప్రకారం వాల్ నట్స్ ను రోజూ గుప్పెడు మోతాదులో తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గాయని నిర్దారించారు.
రోజూ గుప్పెడు మోతాదులో వాల్ నట్స్ ను తినడం వల్ల త్వరగా చనిపోయే అవకాశాలు 12 శాతం వరకు తగ్గగా, గుండె జబ్బులతో చనిపోయే అవకాశాలు 26 శాతం వరకు తగ్గాయి. అందువల్ల రోజూ వాల్ నట్స్ ను తింటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు.
ఇక రోజూ వాల్ నట్స్ ను తినడం వల్ల సగటు ఆయుర్దాయం 1 నుంచి 2 ఏళ్ల వరకు పెరిగిందని కూడా సైంటిస్టులు తెలిపారు. వాల్ నట్స్ లో ఉండే పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎక్కువ కాలం పాటు జీవించేలా చేస్తాయి. అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి. కనుక రోజూ గుప్పెడు వాల్ నట్స్ ను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.