చిరు ధాన్యాల్లో అనేక పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. సామలు, కొర్రలు, అరికెలు, రాగులు.. వీటిని చిరు ధాన్యాలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో చిరు ధాన్యాలను తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే చిరు ధాన్యాలను తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చని, అవి వచ్చే ప్రమాదం తప్పుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.
హైదరాబాద్‌కు చెందిన ఇక్రిశాట్ పరిశోధకులు 900పై చేపట్టిన 19 అధ్యయనాలను విశ్లేషించారు. ఈ క్రమంలో వారు చెబుతున్నదేమిటంటే.. చిరు ధానయాలను రోజూ కనీసం 50 నుంచి 200 గ్రాముల మోతాదులో తింటే గుండె జబ్బులు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఆయా వ్యాధులు లేనివారికి అవి వచ్చే ముప్పు కూడా తగ్గుతుందని అంటున్నారు.
చిరు ధాన్యాలను తిన్న వారిలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు 8 శాతం వరకు తగ్గాయని, 10 శాతం మందిలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయిలు తగ్గాయని, అలాగే ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు కూడా అదే శాతంలో తగ్గాయని తెలిపారు. బీపీ 5 శాతం తగ్గిందన్నారు.
చిరుధాన్యాలను తిన్న వారిలో బీఎంఐ 7 శాతం తగ్గిందని, శరీర బరువు కూడా తగ్గారని తేల్చారు. ఇందుకు గాను అధ్యయనాల్లో పాల్గొన్న వారు 21 రోజుల పాటు చిరుధాన్యాలను తిన్నట్లు వివరించారు. అందువల్లే ఆయా ఫలితాలు వచ్చాయని తెలిపారు.
చిరు ధాన్యాలను తిన్నవారిలో షుగర్ లెవల్స్ కూడా తగ్గాయని, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గిందని తెలిపారు. అందువల్ల రోజూ చిరుధాన్యాలను తింటే అనేక వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.