ప్రస్తుత తరుణంలో యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఎన్నో దేశాలకు చెందిన ప్రజలు యోగాను పాటిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు. దీంట్లో దేశ విదేశాలకు చెందిన వారు ఎంతో మంది పాల్గొంటున్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు యోగాలో మునిగిపోయారు. అయితే కొంత మంది మాత్రం యోగా శాస్త్రీయం కాదని, దాంతో ఎలాంటి లాభం కలగదని, పైపెచ్చు దాని వల్ల నష్టాలే కలుగుతాయని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కానీ హార్వర్డ్ యూనివర్సిటీ వారు కొన్నేళ్ల పాటు చేసిన పరిశోధనల ప్రకారం తెలిసిందేమిటంటే యోగాతోపాటు మెడిటేషన్ వంటివి చేయడం వల్ల ప్రజలు తమ వైద్యానికి పెట్టే ఖర్చును 43 శాతం వరకు తగ్గించవచ్చట. అవును, మీరు విన్నది నిజమే. యోగా వల్ల మన ఆరోగ్యానికి ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులే స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు.
అమెరికాలోని కేంబ్రిడ్జి ప్రాంతంలో ఉండే హార్వర్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ (ఎంజీహెచ్) పరిశోధకులు, బెన్సన్ హెన్రీ ఇనిస్టిట్యూట్ (బీహెచ్ఐ) పరిశోధకులు కలిసి 2006 నుంచి 2014 వరకు దాదాపు 8 సంవత్సరాల పాటు కొంత మందిపై పరిశోధనలు చేశారు. యోగా, మెడిటేషన్ వంటివి నిత్యం చేసే వారిని కొంత మందిని తీసుకున్నారు. అవేవీ చేయని ఇంకొంత మందిని కూడా పరిశోధనకు తీసుకున్నారు. అలా వారిని దాదాపు 8 ఏళ్ల పాటు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారి ఆరోగ్యంపై కూడా అన్ని విషయాలు తెలుసుకున్నారు.
ఎంజీహెచ్, బీహెచ్ఐ పరిశోధకులు అలా 8 ఏళ్ల పాటు చేసిన పరిశోధనలను విశ్లేషించగా చివరకు తెలిసిందేమిటంటే నిత్యం యోగా, మెడిటేషన్ వంటివి చేసే వారి ఆరోగ్యం ఎంతో బాగుందని తేలింది. అలాంటి వారిలో చాలా మందికి గుండె, నరాలు, ఎముకలు, కీళ్లు, జీర్ణ సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గాయట. ఇంకొంత మందికి పూర్తిగా నయం అయిపోయాయట. ఈ క్రమంలో వారు తమ వైద్యం కోసం చేసే ఖర్చు కూడా దాదాపు 43 శాతం వరకు తగ్గిందట. అదే సమయంలో యోగా, మెడిటేషన్ చేయని వారిలో అధిక శాతం మంది ఆరోగ్యం క్షీణించిందట. దీన్ని బట్టి సదరు పరిశోధకులు ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నారు. నిత్యం యోగా, మెడిటేషన్ చేసే వారిలో ఒత్తిడి, ఆందోళన కూడా పూర్తిగా మాయమైపోయాయట. చూశారుగా యోగా, మెడిటేషన్ వల్ల ఎంతటి ప్రయోజనాలు కలుగుతాయో. ఇంకేం నిత్యం ఎంతో కొంత సమయం వాటి కోసం వెచ్చించండి మరి.