Yoga : యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం మాత్రమే కాదు.. అందులో అనేక రకాల ముద్రలు కూడా ఉన్నాయి. పద్మాసనం వేసినప్పుడు ఈ ముద్రలను వేయాల్సి ఉంటుంది. అయితే ఆ ముద్రల్లో ప్రధానంగా చెప్పుకోదగినది.. వరుణ ముద్ర. ఈ ఒక్క ముద్రను రోజూ యోగా చేసినప్పుడు వేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వరుణ ముద్ర వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చిత్రంలో చూపిన విధంగా వరుణ ముద్రను వేయాల్సి ఉంటుంది. అందుకు గాను బొటనవేలును, చిటికెన వేలును కొనలను ఆనించాలి. తరువాత మిగిలిన మూడు వేళ్లను పైకి నిటారుగా ఉంచాలి. ఇలా వరుణ ముద్ర వేయాలి. పద్మాసనంలో ఉండగా.. రెండు చేతులతో ఒకేసారి ఈ ముద్రను వేయాలి. ఈ భంగిమలో 5 నిమిషాల పాటు ఉండాలి. దీంతో పలు ప్రయోజనాలను పొందవచ్చు.
పైన తెలిపిన విధంగా వరుణ ముద్ర వేయడం వల్ల శరీరంలోని రక్తం మొత్తం శుభ్రమవుతుంది. మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అంటే జ్వరం తగ్గుతుందన్నమాట. అలాగే చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి.
ఇక ఈ ముద్రను ఎవరైనా వేయవచ్చు. కానీ దగ్గు, జలుబు ఉన్నవారు దీన్ని ఎక్కువ సేపు వేయరాదు.