ఒత్తిడి.. ప్రస్తుత తరుణంలో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. నిత్యం అనేక సందర్భాల్లో చాలా మందికి ఒత్తిడి ఎదురవుతుంటుంది. దీంతో అద డిప్రెషన్‌కు దారి తీస్తుంది. తీవ్రమైన మానసిక వేదనకు గురి కావల్సి వస్తుంటుంది. ప్రస్తుతం చాలా మంది.. ముఖ్యంగా యువత, విద్యార్థులు, ఉద్యోగులు దీని బారిన పడుతున్నారు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే దాంతో ఒత్తిడి నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే…
1. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ముఖ్యంగా పాజిటివ్ దృక్ఫథాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే ప్రతీ దాన్నీ నెగెటివ్‌గా ఆలోచించకూడదు. అలా తీసుకోకూడదు. పాజిటివ్‌గానే ఉండాలి. అంటే.. ఉదాహరణకు మీరు చేసిన ఏదైనా పని ఫెయిలైతే.. మన బతుకింతే.. వేస్ట్.. అని అనుకోకుండా.. మరోసారి ప్రయత్నం చేద్దాం, తప్పకుండా విజయం సాధిస్తాం, ఇది కామనే.. అని పాజిటివ్‌గా ఉండాలి. దీంతో ఒత్తిడి చాలా వరకు ఆటోమేటిగ్గా అదే తగ్గిపోతుంది.
2. మనం ఏ పనిచేస్తున్నా సహజంగానే మనకు ఉన్న సమస్యలు పదే పదే గుర్తుకు వస్తుంటాయి. అయితే వాటిని గుర్తుకు తెచ్చుకోకూడదు. అవి గుర్తుకు వచ్చినా దృష్టిని వేరే వాటి మీదకు మరల్చాలి. ఇలా చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది.
3. జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో గడపాలి. ఎంజాయ్ చేయాలి. అస్తవ్యస్తంగా మార్చుకోకూడదు. అదే జరిగితే ఒత్తిడి బాగా పెరుగుతుంది. కనుక ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికలను రచించుకుంటూ జీవితంలో ముందుకు సాగాలి.
4. నిత్యం ఫలానా విధంగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.. అనుకుంటే అదే పనిని రోజూ చేయండి.. దీంతో కచ్చితంగా ఫలితం ఉంటుంది.
5. యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. నిత్యం వీటిని చేయడం అలవాటుగా మార్చుకోవాలి.
6. ఏ పనిచేసినా విజయం సాధిస్తామనే నమ్మకం, బలం, ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
7. ఒత్తిడి తక్కువగా ఉండే పనులు చేసేలా చూసుకోవాలి.
8. అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది.
9. మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి.
10. కూర్చుని పనిచేసేవారు వాలిపోయినట్లు కూర్చోరాదు. నిటారుగా కూర్చోవాలి. దీంతో శరీరంలో ఆక్సిజన్ ఎక్కువగా రవాణా అవుతుంది. అది కొత్త ఆలోచనలను అందిస్తుంది. అలాగే మెదడుకు రిలీఫ్ ఇస్తుంది. వాలిపోయినట్లు కూర్చున్నా మధ్య మధ్యలో నిటారుగా కూర్చోవడం వల్ల ఫలితం ఉంటుంది.
11. రాత్రిపూట నీటిలో నిమ్మరసం కలిపి స్నానం చేయడం వల్ల శరీరానికి హాయి లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
12. మీకు ఇష్టం లేని మాటలు వినకండి. ఇష్టం లేని పనులు చేయకండి. ఇష్టం లేని వారి వద్దకు వెళ్లకండి.
13. రాత్రిపూట పాదాలకు నువ్వుల నూనెను బాగా మర్దనా చేసి పడుకున్నా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మరుసటి రోజుకు మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. నెలకు ఒక్కసారి అయినా నూనెను శరీరానికి పూర్తిగా పట్టించి తరువాత స్నానం చేయాలి. దీంతో కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.
14. ఒత్తిడి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏ పనిచేస్తున్నా ఆపి ఒక్క 5 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. కొన్నిసార్లు శ్వాసను బాగా పీల్చుకుని నెమ్మదిగా వదలండి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.
15. డార్క్ చాకొలెట్, ఐస్ క్రీమ్ వంటి పదార్థాలను తింటే ఒత్తిడి తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. ఇష్టమైన సంగీతాన్ని విన్నా ఒత్తిడి తగ్గుతుంది.
16. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి హాస్య భరిత చిత్రాలు, టీవీ షోలు చూడడం వల్ల, ప్రకృతిలో సరదాగా గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఎల్లప్పుడూ సరదాగా ఉన్నా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అందుకే నవ్వు కూడా మేలు చేస్తుందని పెద్దలు చెబుతుంటారు.