Anti Ageing : మనలో చాలా మంది ఉన్న వయస్సు కంటే తక్కువగా, యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. వయస్సు పెరిగినా కూడా చర్మం ముడతలు లేకుండా, కాంతివంతంగా కనిపించాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. యవ్వనంగా కనిపించడానికి రకరకాల ప్రయత్నాలు చేయడంతోపాటు అధికంగా ఖర్చు చేస్తుంటారు. మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా వయస్సు తక్కువగా, చర్మం ముడతుల లేకుండా, యవ్వనంగా కనిపించేలా చేయవచ్చు. దీని కోసం మనం విటమిన్ ఇ ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి.
వయస్సు పెరిగినా కూడా శరీరంలోని అన్ని కణాలకు, అవయావాలకు, చర్మానికి కూడా తక్కువ వయస్సుగా కనిపించేలా చేసే శక్తి విటమిన్ ఇ కి ఉంటుంది. శరీరంలో ఉండే కణాలు చాలా చిన్నగా ఉంటాయి. కొన్ని కోట్ల కణాలు ఒక దాని పక్కన ఒకటి చేరడం వల్ల అవయవం ఏర్పడతుంది. ఈ అవయవాలు ఒక దాని పక్కన ఒకటి చేరడం వల్ల శరీరం ఏర్పడుతుంది. మన శరీరం కొన్ని కోట్ల కణాల సముదాయంగా చెప్పవచ్చు. మన శరీరం దాదాపుగా 125 ట్రిలియన్ (1 ట్రిలియన్ = లక్ష కోట్లు) కణాల సముదాయంతో ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శరీరంలో ఉండే కణాలు ఆరోగ్యంగా ఉండడం వల్ల అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. అవయవాలు ఆరోగ్యంగా ఉండడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. దీంతో వయస్సు పెరిగినా కూడా తక్కువ వయస్సుగా, యవ్వనంగా కనిసిప్తాము. శరీరంలో ఉండే కణాల పైపొర దెబ్బ తినకుండా దాన్ని ఆరోగ్యంగా ఉంచి, రక్షించే సామర్థ్యం విటమిన్ ఇ కి ఉంటుంది. ఈ పొర ఆరోగ్యంగా ఉండడం వల్ల కణాలు ఆరోగ్యంగా ఉంటాయి.
కణాలలో ఉండే మైట్రోకాండ్రియా మనం తిన్న ఆహారం నుండి శక్తిని విడుదల చేస్తాయి. విటమిన్ ఇ కణాలలో ఉండే మైట్రోకాండ్రియాను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల కణం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ మన చర్మం ఎక్కువగా ముడతలు పడుతుంది. చర్మం లోపలి పొరల్లో ఉండే కొల్లాజన్ చర్మం ముడతలు పడకుండా గట్టిగా ఉండడంలో సహాయపడుతుంది. ఈ కొల్లాజన్ తయారవడానికి విటమిన్ ఇ ఎక్కువగా అవసరమవుతుంది. విటమిన్ ఇ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కొల్లాజన్ ఆరోగ్యంగా ఉండి వయస్సు పెరిగినా కూడా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. అంతే కాకుండా చర్మాన్ని అతిలోహిత కిరణాల నుండి కాపాడడంలో కూడా విటమిన్ ఇ సహాయపడుతుంది.
విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడడంలో సహాయపడుతుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తొలగించి శరీర కణాలను కాపాడుతుంది. ప్రతిరోజూ మన శరీరానికి 15 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ అవసరమవుతుంది. గర్భిణీలకు, బాలింతలకు 19 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ అవసరమవుతుంది. చాలా మంది విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వాడుతూ ఉంటారు. వీటి అవసరం లేకుండా మనం తినే ఆహార పదార్థాల నుండి విటమిన్ ఇ ని పొందవచ్చు.
100 గ్రా. ల బాదం పప్పులో 28 మిల్లీ గ్రా. విటమిన్ ఇ ఉంటుంది. బాదం పప్పులతోపాటు విటమిన్ ఇ ని అత్యధికంగా కలిగిన వాటిలో పొద్దు తిరుగుడు గింజల పప్పు ఒకటి. వీటిలో 35 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ ఇ లభిస్తుంది. దీంతో వయస్సు ఎక్కువగా ఉన్నా.. తక్కువ వయస్సు ఉన్నట్టుగా, యవ్వనంగా కనిపిస్తారు.