Potato Tomato Curry : మనం వంటింట్లో టమాటాలను ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలకు ఇతర కూరగాయలను, దుంపలను కలిపి మనం కూరలను వండుతూ ఉంటాం. ఇలా టమాటాలను ఉపయోగించి చేసే కూరలలో ఆలూ టమాటా కూర ఒకటి. ఆలూ టమాటా కూర సరిగ్గా చేసుకోవాలే కానీ చాలా రుచిగా ఉంటుంది. ఆలుగడ్డలు, టమాటాలు ఇవి రెండు కూడా మన శరీరానికి మేలు చేసేవే. ఆలూ టమాటా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ టమాటా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన ఆలుగడ్డలు – 3, టమాటాలు – పావు కిలో, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చి మిర్చి – 2, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ, టమాటా కూర తయారీ విధానం..
ముందుగా ఉడికించిన ఆలుగడ్డలను పొట్టు తీసి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత టమాటాలను కూడా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి కాగాక తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక తరిగిన టమాట, రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తరువాత ఆలుగడ్డ ముక్కలు, కారం వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే ఆలూ టమాటా కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా, దోశ, పులావ్ వంటి వాటితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.