సజ్జలు మిల్లెట్స్ జాబితాకు చెందుతాయి. వీటినే చిరు ధాన్యాలు, సిరి ధాన్యాలు అని పిలుస్తారు. ఎలా పిలిచినా సరే ఇవి మనకు అనేక పోషకాలను అందివ్వడంతోపాటు శక్తిని కూడా అందిస్తాయి. ఈ క్రమంలోనే సజ్జలను ఎలా తీసుకోవాలి ? అని అనుకునేవారికి కింద తెలిపిన టిప్ ఉపయోగపడుతుంది. సజ్జలను తీసుకోవాలనుకునే వారు వాటితో పిండి చేసుకుని ఆ పిండిని మజ్జిగతో కలిపి దాంతో చక్కని వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. దాన్ని నిత్యం తయారు చేసుకుని తాగితే శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి.
సజ్జ పిండి మజ్జిగ తయారు చేసే విధానం
బాగా మందంగా ఉండే అడుగు ఉన్న గిన్నె తీసుకుని రెండు టీస్పూన్ల సజ్జ పిండిని తీసుకుని నూనె లేకుండా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. 2 టీస్పూన్ల సజ్జ పిండికి 1 కప్పు నీళ్లు సరిపోతాయి. ఒకసారి పొంగు రాగానే మంట తగ్గించి దానికి కప్పు మజ్జిగ కలిపి పెట్టుకోవాలి. మరో నిమిషం పాటు ఉడికించి దించి చల్లార్చుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన అల్లం, పావు టీస్పూన్ అల్లం రసం కలుపుకోవాలి. ఎండ వేడి మూలంగా ఏర్పడే అలసట, నిస్సత్తువ, నీరసం వంటి సమస్యల నుంచి తక్షణమే ఉపశమనం లభించాలంటే ఈ విధంగా సజ్జపిండి మజ్జిగను తయారు చేసుకుని నిత్యం సేవించవచ్చు. చక్కని రంగు రావాలంటే అందులో కొద్దిగా దానిమ్మరసం లేదా అనార్ దానా కలుపుకుని తాగవచ్చు.
సజ్జలు చిరు ధాన్యాలు కనుక వాటితో అన్నంలా వండుకుని తినలేం అనుకునే వారు వాటిని నిత్యం ఈ విధంగా తీసుకున్నా.. వాటి ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. శక్తి లేనట్లు బలహీనంగా ఉండేవారు రోజూ దీన్ని తాగితే అమితమైన శక్తి లభిస్తుంది. ఎంతో ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. ఎంతటి పని చేసినా అంత త్వరగా అలసిపోరు.