Wheat Dosa : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కొందరు పెసరట్టును తయారు చేస్తూ ఉంటారు. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మందరికీ తెలుసు. కానీ దోశ పిండిని తయారు చేయడానికి సమయం ఎక్కువగా పడుతుంది. దోశ పిండిని ముందు రోజే తయారు చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. అంత సమయం లేని వారు మనలో చాలా మందే ఉంటారు. అయితే కేవలం 10 నిమిషాలలోనే మనం దోశలను తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండిని ఉపయోగించి మనం ఈ దోశలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. గధుమ పిండితో చపాతీ, పుల్కా, రోటీ వంటి వాటినే కాకుండా దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండితో దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపపప్పు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – అర టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3, తరిగిన కరివేపాకు – రెండు రెబ్బలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన టమాట – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, గోధుమ పిండి – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – 2 కప్పులు, నూనె – అర కప్పు.
గోధుమ పిండి దోశ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప పప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరను వేసి కలిపి చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, ముందుగా వేయించి చల్లార్చిన ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లను పోసుకుంటూ దోశ పిండిలా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దిగా మందంగా ఉండేలా పెనం మీద దోశలా వేసి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి రెండు దిక్కులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి దోశలు తయారవుతాయి. ఈ దోశలు మాములు దోశలంత పలుచగా రావు. అయినప్పటికీ అద్భుతమైన రుచిని అందిస్తాయి. ఇక గోధుమ పిండి దోశలను టమాట చట్నీ, పల్లి చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఉదయం పూట సమయం లేని వారు ఇలా గోధుమ పిండితో చాలా తక్కువ సమయంలో దోశలను తయారు చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.