Goruchikkudu Vellulli Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో గోరు చిక్కుడు కాయలు కూడా ఒకటి. ఇతర కూరగాయల లాగా ఇవి కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గోరు చిక్కుడు కాయలలో పొటాషియం, ఫోలేట్, ఐరన్, కాల్షియం వంటి మినరల్స్ తోపాటు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి విటమిన్లు కూడా ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ చురుకుగా జరుగుతుంది. బీపీ నియంత్రించబడుతుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ గోరు చిక్కుడు కాయలను తినడానికి చాలా మంది ఇష్టపడరు.
గోరు చిక్కుడు కాయలతో ఎక్కువగా మనం ఫ్రై ని చేస్తుంటాం. తరచూ చేసే ఫ్రై కి బదులుగా వెల్లుల్లి కారాన్ని వేసి చేసే గోరు చిక్కుడు కాయ ఫ్రై ఇంకా రుచిగా ఉంటుంది. ఇలా చేసిన ప్రై ని అందరూ ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా వెల్లుల్లి కారాన్ని వేసి గోరు చిక్కుడుకాయ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోరు చిక్కుడు వెల్లుల్లి ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన గోరు చిక్కుడు – అర కిలో, వెల్లుల్లి రెబ్బలు – 10, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, శనగ పప్పు – అర టీ ప్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్.
గోరు చిక్కుడు వెల్లుల్లి ఫ్రై తయారు చేసే విధానం..
ముందుగా గోరు చిక్కుడు ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు, పావు టీ స్పూన్ ఉప్పును వేసి 5 నిమిషాల పాటు ఉడికించి నీటిని పారబోసి పక్కన ఉంచాలి. ఇప్పుడు జార్ లో ఎండు కొబ్బరి ముక్కలను, రుచికి తగినంత మరికొద్దిగా ఉప్పును, కారాన్ని, వెల్లుల్లి రెబ్బలను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత శనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకును వేసి వేయించాలి.
ఇవి వేగిన తరువాత ముందుగా ఉడికించుకున్న గోరు చిక్కుడు కాయలను, పసుపును వేసి కలిపి మధ్యస్థ మంటపై గోరు చిక్కుడు పూర్తిగా వేగే వరకు వేయించుకోవాలి. గోరు చిక్కుడు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి కలిపి మరో 3 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోరు చిక్కుడు వెల్లుల్లి ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా గోరు చిక్కుడు కాయలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.