Mint Leaves : మనం వంటల తయారీలో ఉపయోగించే వాటిల్లో పుదీనా కూడా ఒకటి. వంటల తయారీలో దీనిని ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పదీనాతో మనం పచ్చడిని, రైస్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. పుదీనా చక్కని సువాసనను కలిగి ఉండడమే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. దేశవాళీ పుదీనా తీపి రుచిని కలిగి వాడిన వెంటనే వేడి చేసి తరువాత చల్లదదాన్ని కలిగించే గుణం కలిగి ఉంటుంది. మనం తినే ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి పొట్టలోని దోషాలను తొలగించి పొట్టకు బలాన్ని చేకూర్చడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వాంతులను, అపస్మారక స్థితిని, తెరలు తెరలుగా వచ్చే కడుపు నొప్పిని, పాండు రోగాన్ని కూడా పుదీనా నయం చేస్తుంది.
పుదీనా ఆకులతో కషాయాన్ని చేసి భరించ గలిగే వేడిగా ఉన్నప్పుడు ఆ కషాయంతో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు అన్నీ తగ్గుతాయి. పుదీనాతో పచ్చడిని చేసుకుని తినడం వల్ల అన్నాన్ని ఇష్టపడని వారికి, అన్నం చూడగానే వాంతి చేసుకునే వారికి, అజీర్తి ఉన్న వారికి, రుచి కోల్పోయిన వారికి ఆయా సమస్యలు తగ్గుతాయి. పుదీనా ఆకులను కడిగి దంచి రసాన్ని తీసి ఆ రసంలో చక్కెరను కలిపి కొద్ది కొద్దిగా నాలుకతో నాకుతూ ఉంటే వెక్కిళ్లు తగ్గుతాయి. పిల్లలకు కడుపులో నులి పురుగులు ఉన్నప్పుడు వయసును బట్టి పావు టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ పుదీనా రసాన్ని రెండు పూటలా తాగిస్తూ ఉంటే కడుపులో పురుగులు నశిస్తాయి. పెద్దలు దీనికి రెట్టింపు మోతాదులో పుదీనా రసాన్ని తీసుకోవడం వల్ల కడుపులో నులి పురుగులు నశిస్తాయి.
పుదీనా ఆకులను కడిగి ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. దీనిని మంచి నీటితో కలిపి నూరి రాత్రి పూట జుట్టుకు రాసి ఉదయాన్నే కడిగేయడం వల్ల వెంట్రుకలు గట్టి పడి రాలకుండా ఉంటాయి. రాలిన వెంట్రుకల స్థానంలో మరలా కొత్త వెంట్రుకలు వస్తాయి. పుదీనా ఆకులను ఎండబెట్టి ఆ ఆకులను వస్త్రాల మధ్యలో ఉంచడం వల్ల వస్త్రాలకు పురుగులు పట్టకుండా ఉంటాయి. పుదీనా రసాన్ని 2 టీ స్పూన్ల మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి మూడు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల విరేచనాలు తగ్గుతాయి. ఒక గ్లాస్ నీటిలో 10 పుదీనా ఆకులను వేసి ఒక కప్పు అయ్యే వరకు మరిగించి వడకట్టి దానిలో కొద్దిగా ఉప్పును వేసి కలిపి తాగడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది.
2 టీ స్పూన్ల పుదీనా రసంలో రెండు చిటికెల యాలకుల పొడిని కలిపి తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. పుదీనా రసానికి సమపాళ్లలో నువ్వుల నూనె కలిపి నూనె మిగిలే వరకు మరిగించి నిల్వ చేసుకోవాలి. ఈ తైలాన్ని పై పూతగా రాయడం వల్ల వాత నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఈ తైలాన్ని విరిగిన ఎముకలపై రాయడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఈ తైలాన్ని రాయడం వల్ల చచ్చుబడిన చేతులు, కాళ్లు మామూలు స్థితికి వచ్చి నడవగలుగుతారు. ఈ విధంగా పుదీనాను వంటలలోనే కాకుండా మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.