Teeth Powder : మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యలల్లో దంతాల సమస్యలు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో చాలా మంది దంతాల సమస్యలతో బాధపడుతున్నారు. దంతాలు పుచ్చి పోవడం, దంతాలు గట్టిగా లేకపోవడం, చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్ల వాపు, వేడి లేదా చల్లటి పదార్థాలను తిన్నప్పడు లేదా తాగినప్పుడు దంతాలు జివ్వుమనడం మొదలగు వాటిని మనం దంతాల సమస్యలుగా చెప్పవచ్చు. ఈ సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మన ఆహారపు అలవాట్లే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్యల నుండి బయటపడడానికి మనం రకరకాల టూత్ పేస్ట్ లను వాడుతూ ఉంటాం. వీటి వల్ల తాత్కాలిక ఫలితం మాత్రమే ఉంటుంది. ఈ సమస్యలన్నింటినీ మనం ఆయుర్వేదం ద్వారా నయం చేసుకోవచ్చు. మన ఇంట్లోనే పళ్ళపొడిని తయారు చేసుకుని దానిని వాడడం వల్ల ఈ సమస్యలన్నింటి నుండి మనం బయటపడవచ్చు.
మనకు అందుబాటులో ఉండే వాటితో చాలా సులువుగా పళ్ళపొడిని మనం తయారు చేసుకోవచ్చు. దంతాల సమస్యలన్నింటినీ నయం చేసే ఈ పళ్ళ పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. ఈ పళ్ళ పొడిని ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనం 50 గ్రాముల సుద్దను, 20 గ్రాముల మిరియాలను, 20 గ్రాముల రాళ్ల ఉప్పును తీసుకోవాలి. ముందుగా ఒక జార్ లో సుద్దను వేసి మెత్తగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదేజార్ లో మిరియాలను, రాళ్ల ఉప్పును వేసి పొడిగా చేసుకోవాలి. ఇందులోనే ముందుగా పొడిగా చేసుకున్న సుద్దను వేసి మరలా మిక్సీ పట్టి దానిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఇలా నిల్వ చేసుకున్న పొడిని రోజూ ఉదయం తగిన మోతాదులో తీసుకుని వేలితో దంతాలను శుభ్రం చేసి నీటితో కడగకుండా ఒక అర గంట పాటు అలాగే ఉండి, ఆ తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు గట్టిపడడమే కాకుండా దంతాల సమస్యలు, చిగుళ్లసమస్యలు అన్నీ తగ్గిపోతాయి. భవిష్యత్తులో కూడా దంతాల సమస్యలు రాకుండా ఉంటాయి.