Thalimpu Annam : మనం ప్రతిరోజూ అన్నాన్ని వండుతూ ఉంటాం. భారతదేశంతోపాటు ఇరత దేశాల వారికి కూడా అన్నం ప్రధాన ఆహారం. బియ్యంతో వండిన ఈ అన్నాన్ని తగిన మోతాదులో తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఒక్కోసారి మన ఇండ్లల్లో వండిన అన్నం మిగులుతూ ఉంటుంది. ఈ మిగిలిన అన్నాన్ని కొందరు పడేస్తూ ఉంటారు. కొందరు నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర వంటివి తయారు చేస్తారు. ఇవే కాకుండా మిగిలిన అన్నాన్ని తాళింపు వేసి మనం తాళింపు అన్నంగా కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని మనం కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మిగిలిన అన్నంతో తాళింపు అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తాళింపు అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – 2 కప్పులు, నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపు అన్నం తయారీ విధానం..
ముందుగా అన్నాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పొడి పొడిగా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత శనగ పప్పును, మినప పప్పును, ఆవాలను, జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పచ్చి మిర్చిని, ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకును వేసి వేయించుకోవాలి. తరువాత పసుపును, ఉప్పును, కారాన్ని వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత అన్నాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తాళింపు అన్నం తయారవుతుంది. ఈ తాళింపు అన్నంలో పల్లీలను, జీడి పప్పును కూడా వేసుకోవచ్చు.అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు లేదా కూర తయారు చేయడానికి సమయం లేనప్పుడు ఇలా చాలా త్వరగా చాలా రుచిగా తాళింపు అన్నాన్ని తయారు చేసుకుని తినవచ్చు. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.