Chapati : మనం గోధుమలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. గోధుమలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. గోధుమలను పిండిగా చేసి మనం చపాతీ, పుల్కా, రోటీ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. అయితే గోధుమ పిండితో చపాతీలను మృదువుగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చపాతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – 3 కప్పులు, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, నూనె – పావు కప్పు.
చపాతీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని అందులో ఉప్పును వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లను పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా పిండిని కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా అయితే కొద్దిగా పొడి పిండిని వేసి కలుపుకోవాలి. పిండి గట్టిగా అయితే నీటిలో చేతిని ఉంచి ఆ తడితో పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తరువాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె బాగా కలిపి మూత పెట్టి 30 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత పిండిని మరోసారి బాగా కలిపి మనకు కావల్సిన పరిమాణంలో ముద్దలుగా చేసుకోవాలి.
తరువాత పొడి పిండిని వేసుకుంటూ మరీ మందంగా, మరీ పలుచగా కాకుండా చపాతీలను వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న చపాతీలను పెనం బాగా వేడి అయిన తరువాత వేయాలి. ఈ చపాతీని రెండు వైపులా పది సెకన్ల పాటు కాల్చుకున్న తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. చపాతీలను కాల్చుకున్న తరువాత మూత ఉండే గిన్నెలో లేదా హాట్ బాక్స్ లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మెత్తగా ఉండే చపాతీలు తయారవుతాయి.
ఇదే చపాతీ పిండితో మనం మడత చపాతీలను కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా చపాతీని చేసుకుని దానికి నూనె రాసి త్రిభుజం ఆకారంలో లేదా చతురస్రాకారంలో మడిచి మరలా చపాతీలా వత్తుకోవాలి. తరువాత నూనె వేస్తూ కాల్చుకోవాలి. ఇలా చేసిన మడత చపాతీలు కూడా మెత్తగా ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల చల్లారిన తరువాత కూడా చపాతీలు మెత్తగా ఉంటాయి.