Sanna Karapusa : మనకు బయట స్వీట్ షాపుల్లో లభించే చిరుతిళ్లల్లో సన్న కారపూస కూడా ఒకటి. ఇదిఎంతో రుచిగా ఉంటుంది. ఈ కారపూసను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వంటింట్లో శనగపిండి ఉండాలే కానీ దీనిని కేవలం పదే నిమిషాల్లోనే మనం తయారు చేసుకోవచ్చు. బయట దొరికే విధంగా రుచిగా ఉండే సన్నకారపూసను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సన్న కారపూస తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, కరివేపాకు – రెండు రెబ్బలు.
సన్న కారపూస తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జల్లెడను ఉంచి అందులో శనగపిండిని వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించిన పిండిలో ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి జంతికల పిండి కంటే కూడా మెత్తగా కలుపుకోవాలి. తరువాత జంతికల గొట్టం అడుగు భాగంలో చిన్న రంధ్రాలు ఉన్న బిళ్లను ఉంచి అందులో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఉంచి మధ్యమధ్యలో గాలి లేకుండా చూసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత మంటను చిన్నగా చేసి అందులో కారపూసను వత్తుకోవాలి.
తరువాత మంటను మధ్థ్యంగా ఉంచి అటూ ఇటూ కదుపుతూ కారపూసను కాల్చుకోవాలి. ఇలా 2 నుండి 3 నిమిషాల పాటు కాల్చుకున్న తరువాత కారపూసను వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా కారపూస అంతా కాల్చుకున్న తరువాత అదే నూనెలో కరివేపాకును వేసి కరకరలాడే వరకు వేయించాలి. ఇలా వేయించిన కరివేపాకును కారపూసలో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా బయట షాపుల్లో దొరికే విధంగా ఉండే సన్నకారపూస తయారవుతుంది. ఈ కారపూసను మనం గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెలరోజుల పాటు తాజాగా ఉంటుంది. బయట దొరికే చిరుతిళ్లను తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి బదులుగా ఇలా ఇంట్లోనే కరపూసను తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.