Ear Wax : మనలో చాలా మంది చెవిలో గులిమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. చెవిలోకి వెళ్లిన దుమ్ము, ధూళి లేదా నీరు వల్ల కానీ ఈ ఇబ్బంది ఏర్పడవచ్చు. ఇవి చెవిలోకి చేరి గులిమిగా తయారవుతాయి. ఈ గులిమి ఒక్కోసారి గట్టిపడిపోవడం వల్ల తాత్కాలికంగా మాటలు వినిపించకపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి సందర్భంలో చెవిని శుభ్రపరుచుకోవడానికి పిన్నీసులను, ఇయర్ బడ్స్ ను, మొనదేలిన వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని ఉపయోగించడం చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలోని సున్నితమైన అవయవాల్లో చెవి కూడా ఒకటి. దీనిలో కర్ణభేరి అనే పలుచటి పొర ఉంటుంది. ఇయర్ బడ్స్, పిన్నీసుల వంటివి ఉపయోగించినప్పుడు అవి కర్ణభేరికి తగిలి కర్ఱభేరి దెబ్బతినడమో, లేదా ఆ గులిమి మరింత లోపలికి వెళ్లడమో జరుగుతుంది. దీంతో చెవుడు రావడమో, ఇన్ ఫెక్షన్ల బారిన పడడమో జరిగే ప్రమాదం ఉంటుంది. ఇయర్ బడ్స్ ను, ఇనుప వస్తువులను చెవులను శుభ్రపరుచుకోవడానికి ఉపయోగించకూడదని దీని వల్ల చెవులు దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
చెవిలో గులిమి ఏర్పడడమనేది సహజ ప్రక్రియ. చెవిలోని కొన్ని గ్రంథులే దీనిని స్రవిస్తాయి. గులిమి వల్ల చెవికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇది సాధారణ స్థాయిలో ఉంటే చెవికి మంచే జరుగుతుందట. ఎందుకంటే ఈ గులిమిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయట. అసలు చెవులు శుభ్రం కావడానికే గులిమి తయారవుతుందట. చెవిలో గులిమి ఏర్పడగానే భయపడిపోయి దానిని శుభ్రపరచడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తే ప్రమాదాలు పంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కొందరిలో సాధారణ స్థాయి కంటే ఎక్కువగా గులిమి తయారవుతుంది. అలాంటి వారు ఈ గులిమిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేయాలి. ఇంటి చిట్కాను పాటించడం వల్ల మనం చెవిలో గులిమిని సులభంగా తొలగించుకోవచ్చు. ఉప్పు నీటిలో దూదిని ముంచి దానిని చెవి పై భాగంలో ఉంచి రెండు లేదా మూడు చుక్కల నీటిని పిండాలి. మరో చెవిని చేత్తో మూసివేయాలి. తరువాత చెవిని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఉప్పు నీటికి బదులుగా మినరల్ ఆయిల్ ను, బేబీ ఆయిల్ ను కూడా ఉపయోగించవచ్చు.
వీటిని ఎలాంటి అలర్జీలు లేని వారు మాత్రమే వాడాలి. బేబి ఆయిల్, మినరల్ ఆయిల్ వంటి వాటిని ఉపయోగిస్తే అలర్జీ వస్తుంది అనుకునే వారు ఉప్పు నీటిని ఉపయోగించడమే మంచిది.