Anda Keema Curry : కోడిగుడ్లతో సహజంగానే చాలా మంది అనేక రకాల వంటలను చేస్తుంటారు. కోడిగుడ్లతో చేసే ఏ వంటకం అయినా సరే రుచిగా ఉంటుంది. కోడిగుడ్లతో టమాటా కలిపి వండుతారు. కొందరు వేపుడు చేస్తారు. కొందరు పులుసు పెట్టుకుంటారు. అయితే కోడిగుడ్లతో అండా కీమా కర్రీ కూడా చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీలు.. దేంతో అయినా దీన్ని తినవచ్చు. ఈ క్రమంలోనే అండా కీమా కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అండా కీమా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – మూడు, గుడ్లు – రెండు, ఉల్లిపాయ – ఒకటి, టమాటాలు – రెండు, కొత్తిమీర – ఒక కట్ట, పచ్చి మిర్చి – రెండు, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, కారం – రెండు టీస్పూన్లు, ధనియాల పొడి – ఒక టీస్పూన్, పావ్ భాజీ మసాలా – ఒక టీస్పూన్, చాట్ మసాలా – ఒక టీస్పూన్, ఉప్పు – తగినంత, నూనె – మూడు టేబుల్ స్పూన్లు.

అండా కీమా కర్రీని తయారు చేసే విధానం..
స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి జీలకర్ర వేయించి తరువాత పచ్చి మిర్చి, ఉల్లిపాయ తరుగు వేయాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, టమాటా ముక్కలు, తగినంత ఉప్పు వేయాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, పావ్ భాజీ మసాలా, చాట్ మసాలా వేసి కలిపి పావు కప్పు నీళ్లు పోయాలి. ఇది కూరలా తయారై నూనె పైకి తేలాక ఉడికించిన గుడ్డును చేత్తో మెదిపి అందులో వేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టాలి. ఇప్పుడు మిగిలిన రెండు గుడ్ల సొనను గిలకొట్టి కూరలో వేసి బాగా కలిపి ఐదారు నిమిషాలయ్యాక దింపేయాలి. దీంతో రుచికరమైన అండా కీమా కర్రీ తయారవుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీలు వేటితో తిన్నా సరే రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.