Broad Beans Pickle : మనం చిక్కుడు కాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చిక్కుడు కాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. చిక్కుడు కాయల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. చిక్కుడు కాయలతో వేపుడు, కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా చిక్కుడు కాయలతో నిల్వ పచ్చడిని కూడా తయారు చేస్తారు. చిక్కడు కాయలతో చేసే నిల్వ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పక్కా కొలతలతో ఈ పచ్చడిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడు కాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నాటు చిక్కుడు కాయలు – అర కిలో, ఆవాలు – 3 టేబుల్ స్పూన్స్, మెంతులు – ఒక టేబుల్ స్పూన్, చింతపండు – 125 గ్రా., పల్లి లేదా ఆవ నూనె – 250 ఎమ్ ఎల్, కారం – ముప్పావు కప్పు, ఉప్పు – పావు కప్పు, పసుపు – అర టీ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆవాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – ఒక టీ స్పూన్, ఎండుమిరపకాయలు – 5, కరివేపాకు – రెండు రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు, ఇంగువ – అర టీ స్పూన్.
చిక్కుడు కాయల నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఆవాలు, మెంతులు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో చింతపండును తీసుకుని అందులో ఒక కప్పు వేడి నీటిని పోసి నానబెట్టాలి. తరువాత చిక్కుడు కాయలను శుభ్రంగా తడి లేకుండా తుడుచుకుని గాలికి ఆరబెట్టాలి. తరువాత చిక్కుడు కాయ చివర్లను తొలగించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి నూనెను వేడి చేయాలి. నూనె వేడయ్యాక చిక్కుడు కాయలను వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై 5 నుండి 8 నిమిషాల పాటు వేయించి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించుకోవాలి. తరువాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత వెల్లుల్లి రెబ్బలను వేసి కొద్దిగా వేయించాలి. చివరగా ఇంగువను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాళింపును నూనెతో సహా చిక్కుడుకాయల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మరో 100 గ్రాముల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చింతపండు గుజ్జును వేసి 10 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జును కూడా చిక్కుడు కాయల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్లో కారం, ఉప్పు, పసుపు, ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవ మిశ్రమాన్ని వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత ఈ గిన్నెపై మూతను ఉంచి రెండు రోజుల పాటు అలాగే ఉంచాలి.
రెండు రోజుల తరువాత పచ్చడిని మరోసారి అంతా కలిపి గాజు సీసాలోకి లేదా జాడీలోకి తీసుకోవాలి. ఈ పచ్చడిని బయటే ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల రెండు నుండి మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది. అదే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల నాలుగు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఆవకాయకు ఏమాత్రం తీసిపోని చిక్కుడు కాయ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ముదురుగా ఉండే చిక్కుడు కాయలతో ఈ పచ్చడిని చేయడం వల్ల పచ్చడి మరింత రుచిగా ఉంటుంది.