Eggless Masala Curry : మాంసాహారం తినే వారికి ఎన్నో రకాల రెసిపీలు అందుబాటులో ఉంటాయి. అలాగే కోడిగుడ్డు మాత్రమే తినేవారు కూడా దానితో వివిధ రకాలుగా మసాలా వంటలు చేసుకోవచ్చు. పూర్తి శాఖాహారులకు మాత్రం మసాలా కూరలు కొద్దిగా తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. అలాంటి వారి కోసమే ఈ ఎగ్ లెస్ మసాలా కర్రీ. కోడిగుడ్లను ఉపయోగించకుండా అదే రుచితో ఈ ఎగ్ లెస్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ లెస్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పన్నీర్ – 200 గ్రా., ఉడికించిన బంగాళాదుంపలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), ఉప్పు – తగినంత, కార్న్ ఫ్లోర్ – పావు కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, పెద్దగా తరిగిన ఉల్లిపాయలు – 2, ఉడికించిన టమాటాలు – 3, జీలకర్ర – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, శనగపిండి – ఒక టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఎగ్ లెస్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా పన్నీర్ ను తురుముకోవాలి. అలాగే ఉడికించిన బంగాళాదుంపలను కూడా తురుముకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని అంతా కలిసేలా బాగా కలపాలి. ఈ మిశ్రమం నుండి కోడిగుడ్డులోని తెలసొన తయారు చేయడానికి ముప్పావు వంతు , పచ్చసొన తయారు చేయడానికి పావు వంతు ఇలా రెండు భాగాలుగా వేరు చేయాలి. పచ్చసొన తయారు చేయడానికి వేరు చేసిన మిశ్రమంలో పావు టీ స్పూన్ పసుపును వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ గుండ్రని ఉండలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే తెల్లసొన తయారు చేయడానికి తీసిన భాగంలో కార్న్ ఫ్లోర్ ను వేసి బాగా కలపాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని తగిన మోతాదులో తీసుకుని అప్పలాగా వత్తుకోవాలి. తరువాత దాని మధ్యలో ముందుగా తయారు చేసిన ఉండను ఉంచి కోడిగుడ్డు ఆకారంలో వత్తుకోవాలి. తరువాత వీటిపై కార్న్ ఫ్లోర్ ను అద్ది ఎక్కువగా ఉన్న పిండిని తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒకటి లేదా రెండింటిని వేసి వేయించుకోవాలి. వీటిని నూనెలో వేయగానే గంటెతో కదపకూడదు. కొద్దిగా కాలిన తరువాత గంటెతో అటూ ఇటూ కదుపుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో ఉడికించిన టమాటాలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల నూనెను వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాట ఫ్యూరీ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత శనగపిండి వేసి కలిపి మరో నిమిషం పాటు వేయించాలి.
తరువాత తగినన్ని నీళ్లు పోసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత పచ్చిమిర్చి, మరికొద్దిగా కరివేపాకు , వేయించిన పన్నీర్ గుడ్లు, కొత్తిమీర వేసి నెమ్మదిగా కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ లెస్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి వంటి వాటితో కలిపి తినవచ్చు. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా ఎంతో రుచిగా ఎగ్ లెస్ కర్రీని తయారు చేసి వారిని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు.