Nethi Bobbatlu Recipe : నేతి బొబ్బట్లు… అసలు వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు. వీటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి మనకు బయట కూడా లభిస్తూ ఉంటాయి. ఈ నేతి బొబ్బట్లను బయట లభించే విధంగా మెత్తగా, రుచిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నేతి బొబ్బట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒకటింపావు కప్పు, బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రెండు చిటికెలు, నూనె లేదా నెయ్యి – అర కప్పు, నానబెట్టిన శనగపప్పు – ఒక కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు, బెల్లం తురుము – ఒక కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
నేతి బొబ్బట్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత అందులో రవ్వ, ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే మెత్తగా ఉండేలా పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తరువాత నూనె లేదా నెయ్యి వేసి పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను పెట్టి 3 గంటల పాటు పిండిని నాననివ్వాలి. తరువాత కుక్కర్ లో శనగపప్పు, నీళ్లు పోసి పప్పును ఉడికించాలి. శనగపప్పును 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి పప్పులో ఉన్న ఎక్కువగా ఉన్న నీటిని తీసివేయాలి.
ఇందులోనే బెల్లం తురుము, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత మిక్సీ పట్టుకున్న శనగపప్పు, బెల్లం మిశ్రమాన్ని వేసి దగ్గర పడే వరకు కలుపుతూ వేయించాలి. శనగపప్పు మిశ్రమం దగ్గరపడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మరో టీ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ తగినంత శనగపప్పు మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి.
తరువాత ముందుగా సిద్దం చేసుకున్న మైదాపిండిని మరోసారి బాగా కలపాలి. తరువాత మందంగా ఉండే ఒక పాలిథిన్ కవర్ ను దానికి పిండిని కలపగా మిగిలిన నెయ్యిని రాయాలి. ఇప్పుడు తగినంత మైదాపిండిని తీసుకుని అప్పంలా వత్తుకోవాలి. తరువాత దాని మధ్యలో శనగపప్పు మిశ్రమాన్ని ఉంచి అంచులను మూసివేయాలి. తరువాత దీనికి నెయ్యిని రాసుకుంటూ చేత్తో బొబ్బట్ల ఆకారంలో వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న బొబ్బట్లను వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. ఈ బొబ్బట్ల మీద నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, మెత్తగా ఉండే నేతి బొబ్బట్లు తయారవుతాయి. ఈ బొబ్బట్లను అందరూ ఇష్టంగా తింటారు.