Liver Problems Symptoms : మన శరీరంలో ఉండే అంతర్గత అవయవాల్లో కాలేయం ఒకటి. మనం జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కానీ మన లోపలి అవయవాలు ఏం పనులు చేస్తాయో పట్టించుకోము. మన లోపలి అవయవాలు అన్నీ మనం జీవించి ఉండడానికి సహకరిస్తూ వాటి విధులను నిర్వహిస్తాయి. కాలేయం కూడా ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. వాటికి భిన్నమైన కారణాలు ఉంటాయి. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, కొన్ని రకాల మందులు వాడడం, అధిక బరువు, కాలేయంలో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ కాలేయ వ్యాధులకు దారి తీస్తాయి.
కాలేయంలో సమస్యలు ఉన్నప్పుడు బయటపడే లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, అలసట, శక్తి లేనట్టుగా అయిపోవడం, విరోచనాలు లాంటివి ఉంటాయి. ఆరోగ్యం బాగా లేదు అనిపిస్తుంది కానీ కారణాలు తెలియని లక్షణాలు ఇవి. కాలేయ సమస్యలు తీవ్రమవుతున్నప్పుడు కళ్లు, చర్మం పచ్చగా మారతాయి. ఈ సమస్యను కామెర్లుగా పిలుస్తాం. ఎర్ర రక్తకణాల్లో పసుపు రంగులో ఉండే బిలిరూబిన్ అనే పదార్థం పేరుకుపోయినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. సాధారణంగా కాలేయం దానిని బయటకు పంపుతూ ఉంటుంది. కాలేయం సవ్యంగా పని చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు చర్మం పై దురదలు కూడా వస్తాయి.
పొట్ట ఉబ్బడం జరుగుతుంది. అలాగే పాదాలు, మడమలు వాపుకు గురి కావచ్చు. ఇలాంటప్పుడు ఉప్పును తక్కువగా తింటూ మూత్రం ఎక్కువగా బయటకు పోవడానికి మందులు వాడాల్సి ఉంటుంది. కాలేయం పని చేయకపోవడం వల్ల రక్తంలో వ్యర్థాలు పేరుకుపోయి ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది. దాంతో ఏకాగ్రత లేకపోవడం, మతిమరుపు వంటి సమస్యలు ఏర్పడతాయి. సమస్య మరీ తీవ్రతరం అయినప్పుడు వాంతులు, విరోచనాలలో రక్తం పడవచ్చు. అలాగే గాయాలు తగిలినప్పుడు రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. చర్మం పై రక్తం చారికలు కనబడతాయి. ఈ లక్షణాలను బట్టి మనం కాలేయం అనారోగ్యానికి గురి అయిందని గుర్తించాలి. సమస్య గుర్తించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.