Bathroom Vastu : ప్రస్తుత కాలంలో అటాచ్ బాత్రూం లేని బెడ్ రూమ్ లేని ఇళ్లు మనకు కనబడనే కనబడదు. పెద్ద వారు రాత్రి పూట ఇబ్బంది పడతారనే కారణం చేత అయితేనేం, బద్దకం కారణమైతేనేం ఇలా రకరకాల కారణాలతో అటాచ్ బాత్రూంతో బెడ్ రూమ్ ను నిర్మిస్తున్నారు. అయితే ఇలా అటాచ్ బాత్ రూమ్ నిర్మించే వారు దానిని వాస్తు ప్రకారం నిర్మించాలి. లేదంటే లేనిపోని అనార్థాలను తెచ్చి పెట్టుకున్నట్టు అవుతుంది. అయితే మాస్టర్ బెడ్ రూమ్ కు అటాచ్డ్ గా టాయిలెట్ కట్టవచ్చా అనేది చాలా మంది వాస్తు పరంగా సందేహిస్తూ ఉంటారు. పూర్వకాలంలో టాయిలెట్ లను ఇంటికి వెనుక భాగంలో నిర్మించే వారు. నానాటికి పెరుగుతున్న నాగరికత కారణంగా అటాచ్ బాత్ రూమ్ లను ప్రతి గదిలోనూ నిర్మించుకోవడం పరిపాటైంది.
ముఖ్యంగా మాస్టర్ బెడ్ రూమ్ కు అటాచ్డ్ బాత్ రూమ్ కు కట్టడం మనం అందరి ఇండ్లల్లో చూస్తూనే ఉన్నాం. అలాగే గృహ నిర్మాణ సమయంలో పడకగదిని నైరుతి మూలన నిర్మించడం అవశ్యకమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలా నిర్మించినట్టయితే ఆ గృహంలో నివసించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నైరుతిలోనే మాస్టర్ బెడ్ రూమ్ ను నిర్మిస్తూ ఉన్నాం. దీనిని బట్టి మం నైరుతి మూలకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. అలాంటి దానిని శాస్త్రబద్దంగా నిర్మించాలి. ఆ పడక గదిలో అటాచ్డ్ గా కట్టే టాయిలెట్ గది ఇంటిలోని ఇతర గదుల స్థలాన్ని వాడుకోవడం వల్ల మాస్టర్ పడకగది కొలతలల్లో మార్పు వస్తుంది. అంటే ఆగ్నేయం లేదా వాయువ్యం పెరుగుతుంది.
దీంతో ఆ గది శక్తి క్షేత్రం విచ్ఛిన్నమవుతుంది. అలాగే ఇంటి ఆకారం శాస్త్ర విరుద్ధంగా ఉంటే వికారాలు ఏర్పడి దోషపూరితం అవుతుంది. కాబట్టి మాస్టర్ బెడ్ రూమ్ కు అటాచ్డ్ గా టాయిలెట్ కట్టేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి. ఈ సమస్యకు పరిష్కారం కూడా వాస్తుశాస్త్రంలో ఉందని నిపుణులు చెబుతున్నారు. నైరుతి పడకగదికి అటాచ్డ్ బాత్ రూమ్ నిర్మించాల్సి వచ్చినప్పుడు తూర్పు వైపుగా దక్షిణ గోడకు అనుకుని ఉండే విధంగా బాత్ రూమ్ ను నిర్మించాలి. ఇలా నిర్మించిన బాత్ రూమ్ లోని దక్షిణ గోడకు వెంటిలేటర్ నిర్మించాలి. అలాగే ఈ బాత్ రూమ్ కు వాయువ్యంలో తలుపును బిగించాలి. నైరుతి వైపు నుండి తూర్పు భాగం వైపు దక్షిణ గోడకు అనుకుని నిర్మించిన పడక గదిలో దక్షిణం వైపు తల ఉంచి నిద్రించేలా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. అదే సమయంలో నైరుతి వైపు రెండు పడకగదులను నిర్మించాల్సి వచ్చినప్పుడు టాయిలెట్ ల నిర్మాణం వాస్తు ప్రకారం మారుతుంది.