Biyyampindi Sweet : బియ్యం పిండితో మనం రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే తీపి పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి. వంటరాని వారు కూడా చేసేంత సులభంగా , చాలా తక్కువ సమయంలో బియ్యం పిండితో మనం ఒక స్వీట్ ను తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది. బియ్యం పిండితో ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక కప్పు, పాలు – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, ఎండుకొబ్బరి పొడి – ఒక కప్పు.
బియ్యం పిండి స్వీట్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పాలను, నీళ్లను పోసి వేడి చేయాలి. ఇవి కొద్దిగా వేడయ్యాక పంచదార,యాలకుల పొడి వేసి కలపాలి. పాలు మరిగిన తరువాత కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసి ఉండుల లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత 3 టేబుల్ స్పూన్ల ఎండుకొబ్బరి పొడిని వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు బియ్యం పిండి మిశ్రమం కళాయికి అంటుకోకుండా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని చల్లగా అయ్యే వరకు పక్కకు ఉంచాలి. బియ్యం పిండి మిశ్రమం చల్లగా అయిన తరువాత చేత్తో బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని సన్నగా పొడుగ్గా చేత్తో వత్తుకోవాలి. తరువాత దీనిని చేత్తో జంతికలా గుండ్రంగా చుట్టుకోవాలి.
ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఇడ్లీ ప్లేట్ లకు నూనె రాసుకోవాలి. తరువాత జంతికలా చుట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఇడ్లీల వలె ఇడ్లీ ప్లేట్ లో ఉంచి ఉడికించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కుక్కర్ నుండి బయటకు తీయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో ఎండుకొబ్బరి పొడిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కో స్వీట్ ను తీసుకుని ఎండుకొబ్బరిలో వేసి కొబ్బరి పొడి రెండు వైపులా అంటేలా చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి స్వీట్ తయారవుతుంది. ఈ స్వీట్ పై డ్రైఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు, పండుగలకు ఇలా బియ్యంపిండితో స్వీట్ ను తయారు చేసుకుని తినవచ్చు.