Meal Maker Kurma : మనం ఆహారంగా తీసుకునే సోయా ఉత్పత్తుల్లో మీల్ మేకర్ కూడా ఒకటి. సోయా బీన్స్ నుండి నూనెను తీయగా మిగిలిన పిప్పితో ఈ మీల్ మేకర్ లను తయారు చేస్తారు. ఈ మీల్ మేకర్ లలో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి. వీటితో మనం రకరకాల వంటలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
వేడి నీటిలో నానబెట్టిన సోయా చంక్స్ – 50 గ్రా., ఫ్రైడ్ ఆనియన్స్ – ముప్పావు కప్పు, పచ్చిమిర్చి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, పెరుగు – పావు కప్పు, నూనె – అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, టమాటాలు – 100 గ్రా., చింతపండు రసం – 3 టీ స్పూన్స్, నీళ్లు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మీల్ మేకర్ కుర్మా తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు, పెరుగు, కొద్దిగా నీటిని పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేడి నీటిలో నానబెట్టుకున్న సోయా చంక్స్ ను చేత్తో పిండి నీటిని తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక నీళ్లు పిండిన సోయా చంక్స్ ను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో అర కప్పు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అల్లం పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ధనియాల పొడి, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కలపాలి. ఇందులోనే కొద్దిగా నీటిని పోసి బాగా వేయించుకోవాలి. తరువాత టమాటాలను ఫ్యూరీగా చేసి వేసుకోవాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి. నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత వేయించిన సోయా చంక్స్ ను, చింతపండు రసం, నీళ్లను పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ కుర్మా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీల్ మేకర్ లతో ఈ విధంగా చేసిన కుర్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.